తమిళ దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో   నిఖిల్ హీరోగా  రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం రిలీజ్ కు రకరకాల సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మారిన ఈ చిత్రం అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్దితి. అందుకు కారణం పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా బిజినెస్ అవ్వ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని వినికిడి.  నిఖిల్ కు ఉన్న క్రేజ్ తో  కొంత వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగినా నిర్మాత‌లు అనుకున్నట్లుగా అవటం  లేదని టాక్. ఈ సినిమా నిర్మాతలు ...రిలీజ్ చేస్తే వ‌చ్చే లాభాల క‌న్నా మిగిల్చే న‌ష్టాలే ఎక్కువని అంచనా వేస్తున్నారట. ఈలోగా నిఖిల్ ఏదన్నా సినిమా పూర్తి చేసి రిలీజై హిట్ కొడితే ..ఆ వేడిలో రిలీజ్ చేసి ఒడ్డున పడదామనుకున్నారు.

 కానీ నిఖిల్ కొత్త సినిమా ప్రారంభం కాలేదు. హిట్ రాలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ అలా ఆగిపోయింది.  నిఖిల్ మార్కెట్ డౌన్ అయిన నేప‌థ్యంలో  రిట‌ర్న్స్ రావాలంటే కష్టం అంటున్నారు. దాంతో  మినిమం నష్టానికి రిలీజ్ చేసి వదిలించుకోవటం  ఓ పద్దతి , లేదా ఆపేయటం మరో పద్దతి. ఆపేస్తే సంస్దకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సినిమా తీసి రిలీజ్ చేయని సంస్దకు హీరోలు ఉత్సాహంగా డేట్స్ ఇవ్వరు. దాంతో ఏం చేయాలా అని స‌ద‌రు నిర్మాణ సంస్థ రిలీజ్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. మరో ప్రక్క నిఖిల్ ...తన సినిమాని మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడట.
 
ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాను చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.