మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. నాగబాబు కుమార్తెగా ఆమె ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా వెనకడుగు వేయకుండా హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు కూడా నిరాశపరచడంతో నిహారిక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని భావిస్తోందట. 

చిత్ర పరిశ్రమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భవిష్యత్తులో నిహారిక నిర్మాతగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన నిర్ణయాన్ని తండ్రి నాగబాబుకు కూడా నిహారిక చెప్పిందట. ఇప్పటికే నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో వెబ్ సిరీస్ లు కూడా చేసింది. అదే బ్యానర్ ని కొనసాగించి మెగా హీరోలతో సినిమాలు చేయాలని నిహారిక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనిపై నిహారిక అధికారికంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నిహారిక హీరోయిన్ గా మారక ముందు టెలివిజన్ లో కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా కూడా చేసింది. ఇక నిహారిక పెళ్లి గురించి కూడా తరచుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.