ఏ సినిమా అయినా దిల్ రాజు రైట్స్ తీసుకున్నాడు అంటే రిలీజ్ కు ముందే సగం సక్సెస్ అయ్యిపోయినట్లే అంటూంటారు. ఎందుకంటే సినిమా రిలీజ్, పబ్లిసిటీ అన్ని తనదైన శైలిలో జనాల్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తూంటారు దిల్ రాజు. ఓ స్ట్రాటజీగా ధియోటర్స్ ని ఎంపిక చేసి విడుదల చేసి సక్సెస్ కొట్టడంలో ఆయనకు డిస్ట్రిబ్యూటర్ గా అపారమైన అనుభవం ఉంది.

అందుకే చిన్న సినిమా చేసేవాళ్ళు తమ సినిమా పూర్తవగానే దిల్ రాజుకు చూపించాలని ఆశపడుతూంటారు. ఆయనకు నచ్చితే తమ పంట పండినట్లే అని సంబరపడుతూంటారు. ఇప్పుడు మెగా డాటర్ నీహారిక తాజా చిత్రం కు అలాంటి గోల్డెన్ ఆఫర్ తగిలిందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. 'ఒక్క మనసు'తో  హీరోయిన్ గా ఆకట్టుకోలేక పోయిన కొణెదల నీహారిక   వరుస చిత్రాలతో కెరీర్ ని బలపరుచునే పనిలో ఉంది. 

'ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్' అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది.  ఓ పక్క సినిమాల కోసం వైవిధ్యమయిన కథల్ని ఎంపిక చేసుకుంటూనే మరో పక్క వెబ్‌సిరీస్ లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే నీహారిక తెలుగులో 'సూర్యకాంతం' పేరుతో మరో సినిమా చేస్తోంది. 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలో  రాహుల్ విజయ్ హీరోగా నటించారు. 

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.  దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.  నిర్వాణ సినిమాస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ సమర్పిస్తున్నాడు.  మార్చి 29న విడుదలకానున్న ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించాడు.  ఈ సినిమాపై నీహారిక చాలా ఆశలు పెట్టుకుంది.