మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండడం విశేషం. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపించాలని మెగాఫ్యామిలీలో హీరోలు కోరుకుంటున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ ఓ వీరుడి పాత్రలో ఈ సినిమాలో దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. తాజాగా మెగాస్టార్ తమ్ముడు కూతురు నీహారిక కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నీహారిక చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపిస్తుందట. ఆ పాత్రలో కనిపించడానికి ఓ కారణం కూడా ఉందని చెబుతోంది. తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా సైరా నిలవబోతుందని అందులో భాగం కావడానికే ఈ పాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇక నీహారిక హీరోయిన్ గా నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో హీరోయిన్ గా బ్రేక్ అందుకోవాలని ఆశ పడుతోంది మెగాడాటర్.