మెగాడాటర్ నీహారిక కొణిదెల నటించిన 'సూర్యకాంతం' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రణీత్ బ్రమండపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీహారిక తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

కొన్ని సినిమాలు చేతి వరకు వచ్చి వేరే వాళ్లకు వెళ్లిపోతుంటాయి. అలా చేజారిన సినిమాలు సూపర్ హిట్ అయిన తరువాత నేను చేసి ఉంటే బాగుండేదని ఫీల్ అవుతుంటారు. నీహారికకి కూడా అలాంటి అనుభవం ఎదురైందట.

రామ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన 'నేను శైలజ' సినిమాలో హీరోయిన్ గా నీహారికను తీసుకోవాలని అనుకున్నారు. ఆమెను సంప్రదించారు కూడా.. అదే సమయంలో నీహారిక సినిమాల్లో నటించడానికి ఇంట్లో వాళ్లను ఒప్పించే పనిలో ఉందట.

దీంతో దర్శకనిర్మాతలు ఆమెకోసం నెల రోజులు చూసి ఫైనల్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నారు. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఆ విధంగా ఓ హిట్టు సినిమా మిస్ చేసుకుంది మెగాడాటర్.