విలక్షణ నటుడు సముద్రఖని ఓ వైపు కీలక పాత్రల్లో నటిస్తూ, మరోవైపు తనే మెయిన్‌లీడ్‌గా చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు `కార్మేని సెల్వం` అనే చిత్రంతో రాబోతున్నారు.
`కార్మేని సెల్వం`తో వస్తోన్న సముద్రఖని
సముద్రఖని తమిళ నటుడు అయినా ఇప్పుడు తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. తెలుగు యాక్టర్‌గానే మారిపోయాడు. విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ ఆకట్టుకుంటున్నాడు. కొన్ని సార్లు తానే సినిమాని తన భుజాలపై మోస్తూ, సక్సెస్‌లో భాగమవుతున్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా నటుడిగా ఆయన అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన `కార్మేని సెల్వం` అనే చిత్రంలో నటించారు. రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ రూపొందింది.
`కార్మేని సెల్వం` మూవీ రిలీజ్ డేట్
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను కూడా టీమ్ పంచుకుంది. సముద్రఖని, గౌతమ్ మీనన్‌తోపాటు లక్ష్మీ ప్రియా, కార్తీక్ కుమార్, అభినయ, బడవ గోపీ, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
`కార్మేని సెల్వం` మూవీ స్టోరీ ఇదే
ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే డ్రామాగా సాగుతుంది.
ఐనాక్స్ పిక్చర్స్ భాగస్వామ్యంతో `కార్మేని సెల్వం` మూవీ రిలీజ్
ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ , `కార్మేని సెల్వం` ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం` అని తెలిపారు.


