మెగా డాటర్ నీహారిక జనసేన పార్టీకి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బాబాయ్ కి ఓటు వేయండి అంటూ అభిమానులను కోరుతోంది. 'ఒక మనసు' చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన నీహారిక ఆ తరువాత 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాలో నటించింది. ఈ రెండూ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయాయి. 

ప్రస్తుతం ఈమె 'సూర్యకాంతం' సినిమాలో నటిస్తోంది. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మార్చి 23న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రబృందం. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో నీహారికకి పవన్ అభిమానుల నుండి జై పవర్ స్టార్, జై జనసేన అంటూ నినాదాలు ఎదురయ్యాయి.

వారిని మరింత ఉత్సాహపరచడానికి నీహారిక చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. 'పవన్ కళ్యాణ్ అసలు పేరు మీకు తెలుసా.. కొణిదెల కళ్యాణ్ కుమార్.. ఆయన మా నాన్నకు తమ్ముడు.. చిరంజీవికి తమ్ముడు, నాకు బాబాయ్'' అంటూ మొదలుపెట్టిన నీహారిక.. పవన్ ప్రస్తుతం జనసేన పార్టీ ప్రచారంలో బిజీగా ఉన్నారని, తనకు ఆంధ్రలో ఓటు లేదు కాబట్టి.. మీరందరూ జనసేన పార్టీకి ఓటు వేయాలంటూ అభిమానులను కోరింది.

త్వరలోనే తాను కూడా ప్రచారంలో యాక్టివ్ అవుతానని, జనసేన పార్టీ సింబల్ గ్లాస్ తో మంచి మొమొరీ ఉందని, ఆ ఫోటోని ఎన్నికల ముందు షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది.