గత కొంత కాలంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతల మండలిలో వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు విశాల్‌కి, దర్శక, నిర్మాత భారతీరాజాకి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ముసలం పెరిగింది. అది మరో కుంపటికి దారితీసింది. తాజాగా భారతీరాజా కొత్త నిర్మాతల మండలిని ప్రారంభించారు. `తమిళ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌` పేరుతో ఓ కొత్త నిర్మాతల మండలిని స్థాపించారు. 

దీనిపై భారతీరాజా స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలిలో యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్ ఎవరూ లేదు. అది చాలా పాతపడిపోయింది. యాక్టివ్‌గా ఉన్న వారి కోసం ఈ కొత్త నిర్మాతల మండలిని ప్రారంభిస్తున్నాను. అయితే ఉన్న నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ, నిర్మాతల శ్రేయస్సు కోసం కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. మేం క్రియాశీల చిత్ర నిర్మాతలను చేర్చుకున్న తర్వాత మాత్రమే నిర్వహణ బృందం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా నిర్మాతల మండలి సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కొత్త సంఘాన్ని విచ్ఛిన్నంగా పరిగణించవద్దు` అని తెలిపారు. ఈ సందర్భంగా తాను చేయబోతున్న కార్యక్రమాలు, సవాళ్ళను చెబుతూ ఓ నోట్‌ని విడుదలచేశారు. 

ఇదిలా ఉంటే హీరో విశాల్‌కి, భారతీరాజాకు మధ్య కోలీవుడ్‌లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ విషయంలో రూ. 7కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు చేసిన భారతీరాజా, ప్రస్తుతం తమిళ నిర్మాతలకు ఉన్న మండలి ద్వారా ఎటువంటి మంచి జరగడం లేదని అందుకే మరో నిర్మాతల మండలిని తన ఆధ్వర్యంలో నెలకొల్పబోతున్నానని ఆయన ప్రకటించారు.

మరోవైపు త్వరలో జరగాల్సిన తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్ని కారణాల వల్ల మండలి వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని, ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఈ నెల 21న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి గత నెలలో ప్రకటించారు. ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం, ఎన్నికలకు మరింత సమయం కావాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం న్యాయస్థానంలో విచారణలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.