ఒకేరోజు థియేటర్లలో 9 చిత్రాలు.. కానీ ప్రేక్షకులకు నిరాశే!

New Movies Disappoint at Weekend Box Office
Highlights

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సబ్జెక్ట్ బావుంటే సినిమాను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు ప్రేక్షకులు

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సబ్జెక్ట్ బావుంటే సినిమాను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల కంటే తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాలే భారీ లాభాలు రాబట్టాయి. చాలా కాలం తరువాత ఈ శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద తొమ్మిది తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. వీటితో పాటు 'సంజు' అనే హిందీ సినిమా అలానే హాలీవుడ్ సినిమా 'ఎస్కేప్ ప్లాన్2' కూడా విడుదలైంది. తెలుగు సినిమాల విషయానికొస్తే.. ముందుగా 'ఈ నగరానికి ఏమైంది' సినిమా గురించి చెప్పుకోవాలి. బలమైన కథ లేనప్పటికీ కథను ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ సక్సెస్ అయ్యాడు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఈ 
సినిమా. 

మోహన్ లాల్, అల్లు శిరీష్ నటించిన 'యుద్ధభూమి' సినిమాపై నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు ఆర్ట్ వర్క్ పై తీసుకున్న శ్రద్ధ కథనంలో తీసుకోలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిలిటరీ ఆఫీసర్ గా మోహన్ లాల్ అవలీలగా నటించినా.. అల్లు శిరీష్ మాత్రం అసలు సెట్ కాలేదు. అతడి బాడీ లాంగ్వేజ్ మిలిటరీ ఆఫీసర్ పాత్రకు ఏమాత్రం సరిపోలేదు. డబ్బింగ్ సినిమా పైగా దేశభక్తి కాన్సెప్ట్ దీంతో సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. దానికి తగ్గట్లే రిజల్ట్ కూడా వచ్చింది. 

హీరోగా తనను తాను నిరూపించుకోవాలని నందు చాలానే ప్రయత్నిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతడికి మంచి గుర్తింపు లభించినా హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. మరోసారి 'కన్నుల్లో నీ రూపమే' అంటూ లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో కథ, కథనాలు పేలవంగా ఉండడం దానికి తగ్గట్లే టెక్నికల్ వర్క్ కూడా ఉండడంతో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సన్నివేశాలను చూస్తుంటే దీనికంటే షార్ట్ ఫిలిం బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఆడియన్స్ 
సహనానికి పరీక్షనే చెప్పాలి. 

కమెడియన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో హీరో అయిపోయాడు షకలక శంకర్. అతడు నటించిన 'శంభో శంకర' శుక్రవారం విడుదలైంది. విడుదలకు ముందు రెచ్చిపోయి కామెంట్స్ చేసిన శంకర్ మరి ఇప్పుడు రిజల్ట్ చూసి ఏం అంటాడో? సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్ ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరం. పైగా స్క్రీన్ మొత్తం షకలక శంకర్ చేసే అతి తట్టుకోవడం ఆడియన్స్ వల్ల కాదు. భీకరంగా ఊగిపోతూ చేసిన అతడి పెర్ఫార్మన్స్ ఆడియన్స్ పాలిట శాపం. కాబట్టి ఈ వీకెండ్ లో ఈ సినిమాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

వీటితో పాటు విడుదలైన 'నా లవ్ స్టోరీ','సంజీవని','ఐపిసి సెక్షన్ భార్యాబందు','సూపర్ స్కెచ్','మిస్టర్ హోమానంద్' వంటి సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోదు.  

loader