ఇటీవల గ్రాండ్‌గా పెళ్ళి చేసుకుని టాలీవుడ్‌లోనే హైలైట్‌గా నిలిచింది నిహారికా-చైతన్య జంట. ఈ నెల 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్ళి అనంతరం ఫోటో షూట్‌లతో మెస్మరైజ్‌ చేశారు. తాజాగా తిరుపతిలోని  శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. చైతన్య, నిహారికతోపాటు వారి తల్లిదండ్రులున్నారు. నాగబాబు హాజరు కాలేదు. 

పెళ్ళి తర్వాత రెండు రోజులకు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకుని సినీ వర్గాలతోపాటు బంధుమిత్రులను కలిశారు నిస్‌చే. అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు(సోమవారం) ఉదయం వాళ్లు వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

ఇదిలా ఉంటే గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు తనయుడు చైతన్యతో, నిహారిక మ్యారేజ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయితేజ్‌, వంటి మెగా హీరోలు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దిగిన వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో వీరి వివాహ వేడుక జరిగింది.