బిగ్ బాస్ రెండో సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ అప్పట్లో సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే. అతడి కోసం ఆర్మీ తయారై.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన కౌశల్ తనకు పీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, డాక్టరేట్ రాబోతుందని గొప్పలు చెప్పి నవ్వులపాలయ్యాడు.

ఇక అతడు ఆర్మీ కూడా ఫేక్ ఆర్మీ అంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. కౌశల్ ఆర్మీ ద్వారా ఏర్పాటైన ఫౌండేషన్ కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు వార్తలు వచ్చాయి. కౌశల్ ఆర్మీని నడిపించిన కొందరు అభిమానులు మీడియాకెక్కి కౌశల్ ఫ్రాడ్ అంటూ ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు.

ఆ సమయంలో కౌశల్ పేరు మీడియాలో మార్మోగింది. ఇప్పుడు మరోసారి కౌశల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న కౌశల్ ని మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న అడిగారు.

బిగ్ బాస్ సీజన్ 3 టాప్ కంటెస్టంట్ల పేర్లు చెప్పాలని రిపోర్టర్ అడగగా.. ''నేను ఇప్పుడు ఒకరి పేరు చెబితే నా ఆర్మీ మొత్తం  వారికే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందని'' చెప్పారు. ఈ విషయంలో నెటిజన్లు కౌశల్ ని ఏకిపారేస్తున్నారు. ఇంకా నీ ఆర్మీ ఉందా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కౌశల్ ఇంకా అదే భ్రమలో ఉన్నాడని విమర్శిస్తున్నారు.