మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దివంగత వైఎస్సార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను 
రూపొందిస్తున్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా చిత్రబృందం 'ఈనాటి సుప్రభాత గీతం' అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో మనమ్ముట్టి లుక్ ఆకట్టుకుంటోంది.

వైఎస్సార్ పాత్రలో ఆయన ఒదిగిపోయారనే చెప్పాలి. అయితే ఈ పాట చూసిన అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ పాదయాత్ర చేసింది కాంగ్రెస్ జెండాలతో.. కానీ ఇప్పుడు జగన్ నడుపుతోన్న వైకాపా పార్టీకి ప్రత్యేకంగా మరో జెండా ఉంది. ఈ క్రమంలో సినిమాలో ఏ జెండా గుర్తు వాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని కొత్తగా ఓ జెండాను డిజైన్ చేశారు.

కాంగ్రెస్ రంగుల జెండాపై పిడికిలి బిగించిన చేయి గుర్తుతో ఈ జెండా కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త గుర్తు కనిపిస్తున్నట్లు.. జగన్-జనసేన కలిస్తే ఆ కలయిక ఇలానే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దాక్కుతోంది. సీతారామశాస్త్రి సాహిత్యం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.