విడుదలకు ముందే ట్రైలర్ తో వివాదాలకు కేంద్రబిందువులా మారింది 'నేను కేరాఫ్ నువ్వు' సినిమా. ట్రైలర్ లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఓ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను దెబ్బతీసేలా ట్రైలర్ ఉందని ఆరోపిస్తున్నారు.

కొందరు విద్యార్ధులు ఈ సినిమాను బ్యాన్ చేయాలని పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లారు. ఈ వ్యవహారంపై స్పందించిన చిత్ర దర్శకుడు సాగా తుమ్మ అందరినీ క్షమాపణలు కోరాడు. ఆయన మాట్లాడుతూ.. ''నేను కేరాఫ్ నువ్వు ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే చాలా మంది ఫోన్ చేశారు. ఆ ట్రైలర్ కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. 

ఈ విషయంలో ప్రతీ ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను. నా మనసులో  భావాలను చెప్పాను. అంతేకానీ ఎవరినీ కించపరచాలని కాదు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి రాందాస్ గారు ఫోన్ చేసిన ఇది తప్పని చెప్పడంతో వెంటనే వీడియో తొలగించాను. నాకు కుల పిచ్చి లేదు. అదే ఉంటే నా కులం వాడిని పెట్టుకొని సినిమా చేసేవాడ్ని. సినిమాలో నటించిన హీరోది నా కులం కాదు.

స్ట్రగుల్ అవుతున్న హీరోనే పెట్టుకున్నాను. నా సినిమా విడుదలైనా.. కాకపోయినా.. పర్వాలేదు. ప్రజల మనోభావాల్ని కాదని నేను సినిమా రిలీజ్ చేయను. కొందరు కావాలనే వీడియోని కాపీ చేసి షేర్ చేస్తూ ప్రజల మనోభావాల్ని రెచ్చగొడుతున్నారు.  నేను మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా చూసుకుంటాను'' అంటూ చెప్పుకొచ్చారు.