బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సౌత్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమాలో నీల్ నితిన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మీడియా ముందుకొచ్చిన నీల్ నితిన్.. సుజీత్ తనకు కథను నెరేట్ చేసిన తరువాత చాలా రోజుల వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని.. దీంతో తనను సినిమా నుండి తీసేశారేమో అని భయపడినట్లు చెప్పారు.

ఓ అవార్డ్ ఫంక్షన్ లో సుజీత్ కలిసినట్లు.. కొన్ని రోజుల తరువాత ఆయన కలిసి 'సాహో' కథ నెరేట్ చేశారని.. ఆ పాత్ర తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పారు. అయితే ఇదంతా 'బాహుబలి' సినిమా విడుదల కాకముందు జరిగిన స్టోరీ అని.. ఆ సినిమా హిట్ అయిన తరువాత ప్రభాస్ కోసం రెండేళ్ల పాటు ఎదురుచూసినట్లు చెప్పారు. ఆ సమయంలో ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగ్ లో ఉన్నారని.. తను కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నట్లు చెప్పారు.

ఆ సమయంలో 'సాహో' నుండి తనను తీసేశారేమో అని భయపడ్డానని.. కానీ సుజీత్ తన మాట నిలబెట్టుకున్నారని చెప్పాడు. 'సాహో' సినిమా షూటింగ్ తను ఊహించిన  దానికంటే ఎక్కువ రోజులు జరిగిందని.. అదే సమయంలో తన సొంత బ్యానర్ లో నిర్మిస్తోన్న 'బైపాస్ రోడ్' అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా కోసం బరువు తగ్గాలి.. కానీ 'సాహో'లో ఫిట్ గా కనిపించారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చాడు నీల్ నితిన్.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో సౌమ్యంగా, వినయంగా ప్రవర్తిస్తుంటారని చెప్పారు. అబుదబి షూటింగ్ జరుగుతున్నప్పుడు తన భార్య రుక్మిణి గర్భవతిగా ఉందని ప్రభాస్ కి తెలియడంతో ఆయన తన భార్యని కలిసి చాలా బహుమతులు ఇచ్చారని.. అది చాలా గొప్ప విషయమని నీల్ నితిన్ వెల్లడించారు.