గుంటూరు కారం ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ అన్నీ అపశకునాలే. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా తొలగించారని తెలుస్తుండగా ప్రాజెక్ట్ పై పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది.
అల వైకుంఠపురంలో చిత్రం అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రాలకు సారథిగా మారిన త్రివిక్రమ్ ఎట్టకేలకు మహేష్ మూవీ పట్టాలెక్కించాడు. 2023 ప్రారంభంలో పూర్తి స్థాయిలో మూవీ షూటింగ్ మొదలైంది. ఒకసారి స్టార్ట్ చేసి సగం షెడ్యూల్ అయ్యాక మధ్యలో ఆపేశారని కథనాలు వెలువడ్డాయి. షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేశారట.
అనంతరం హైదరాబాద్ శివారులో భారీ హౌస్ సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ సజావుగా సాగుతుండగా త్రివిక్రమ్, మహేష్ మధ్య విబేధాలు తలెత్తాయన్నారు. అందుకే మహేష్ షెడ్యూల్ పక్కన పెట్టి విదేశాలకు వెళ్లారన్నారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ జూన్ 12న మొదలు కావాల్సి ఉంది. గందరగోళం నేపథ్యంలో నటుల కాల్షీట్స్ తేడా కొట్టాయి. అనుకున్న ప్రకారం షెడ్యూల్ మొదలు కాలేదు. 16న అనుకుంటే కుదర్లేదు. ఏకంగా జులైకి వాయిదా వేశారు.
తాజాగా పూజా హెగ్డే, తమన్ లను ప్రాజెక్ట్ నుండి తప్పించారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదాలు, అవకతవలక నేపథ్యంలో అసలు గుంటూరు కారం అవుట్ ఫుట్ పై సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ మూవీ సవ్యంగా వస్తుందా? ఇష్టం వచ్చినట్లు తెరకెక్కిస్తున్నారా? ఏదైనా అయితే నిండా మునిగేది ఎవరు? అనే చర్చ మొదలైంది. చెప్పాలంటే గుంటూరు కారం చిత్రంపై అటు చిత్ర వార్తలతో పాటు అభిమానులకు కూడా ఆసక్తి పోతుంది.
అదే సమయంలో గుంటూరు కారం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. నిర్మాత సూర్య దేవర నాగవంశీ సోషల్ మీడియాలో ధైర్యం ప్రదర్శిస్తున్నా... లోలోపల మధనపడుతూ ఉండవచ్చు. ఇందుకు కారణమైన వారిపై ఆయన అసహనం కలిగి ఉండవచ్చు. ఇక చూడాలి మహేష్, త్రివిక్రమ్ ఆయన్ని ముంచుతారో లేపుతారో..
