టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ మధ్యన తన పై వస్తున్న వార్తల గురించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందోని, వెంటనే ఆపాలంటూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తనను మీడియా వేధిస్తోందని, మీడియాను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రకుల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ ఓ వర్గం మీడియా తనను టార్గెట్‌ చేసిందని పిటిషన్‌లో వివరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రకుల్ గెలిచింది. 

కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అధారిటి ఆమెపై నిరాధార వార్తలను రెండు నెలల క్రితం కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్లు నిర్దారించింది. దాంతో సదరు న్యూస్ ఛానెల్స్ ఏ  ఆధారాలు లేకుండా దుర్భాషలాడారని అంది. అంతేకాకుండా సదరు ఛానెల్స్ ను తప్పుడు రిపోర్ట్ లు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. డిసెంబర్ 17 వ తేదీన రకుల్ కు క్షమాపణ చెప్తూ వార్త ప్రసారం చేయనున్నాయి. అంతేకాకుండా అందుకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు తొలిగించాలని చెప్పింది.  ఆ న్యూస్ ఛానెల్స్ లో Zee News, Zee 24 Taas, Zee Hindustani, TimesNow, India Today, AajTak, India TV, News Nation and ABP News ఉన్నాయి.
 
 ఇక రకుల్‌ పిటిషన్‌పై అప్పట్లోనే స్పందించిన ఢిల్లీ న్యాయస్థానం.. కొంత ఊరట లభించే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రకుల్‌పై మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశించింది.  

కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు చెప్పటమే ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ఉన్నట్లు సోషల్‌ మీడియాతో సహా మీడియా ఛానల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ఆమె ఆవేదన చెందారు.