ప్రముఖ తమిళ నటుడు రాధారావి తనపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై నయనతార స్పందించింది. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఒక లెటర్ ని విడుదల చేసింది. ఇందులో రాధారవి విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారికి చప్పట్లు, అభినందనలు లభిస్తుండడం నాకు షాకింగ్ గా ఉందని చెప్పింది. ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నంత కాలం ఇలాంటి వారు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని మండిపడింది. వృత్తిపరంగా దేవుడు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడని, తమిళనాడు ప్రజలు తనను పనిని గుర్తించి తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పింది.

తనపై ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ సీత, దెయ్యం, దేవత, స్నేహితురాలు, భార్య, ఇలా అన్ని రకాల పాత్రల్లో నటిస్తూనే ఉంటానని చెప్పింది. మరిన్ని విషయాలు చెబుతూ.. ''ముందుగా నేను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన వెంటనే స్పందించిన రాధారవి లాంటి వ్యక్తిని పార్టీలో తొలగించారని'' వెల్లడించింది.

చివరిగా రాధారవికి కౌంటర్ ఇస్తూ... ''మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే.. మహిళలను తక్కువ చేసి మాట్లాడడం మగతనం అనుకుంటారు. ఇలాంటి మగవారి మధ్య బతుకుతున్న ఆడవాళ్లను చూస్తుంటే నాకు జాలేస్తుందని'' చెప్పుకొచ్చింది. చేతిల్లో సినిమాలు లేక ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారంటూ రాధారవిపై మండిపడింది.