Asianet News TeluguAsianet News Telugu

Nayanathara: ttdకి క్షమాపణలు చెప్పిన నయనతార దంపతులు

పెళ్లైన ఆనందం కంటే ఈ వివాదమే ఎక్కువై పోవడంతో ఎట్టకేలకు సారీ చెప్పారు నయనతార, విఘ్నేష్‌ శివన్‌. ఈ మేరకు విఘ్నేష్‌ ఓ నోట్‌ని విడుదల చేశారు. 

nayanathara vignesh shivan shared apology note to ttd
Author
Hyderabad, First Published Jun 11, 2022, 2:49 PM IST

నయనతార-విఘ్నేష్‌ శివన్‌(Nayanathara-Vignesh Shivan) రెండు రోజుల(జూన్‌ 9న)క్రితం మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మహాభలిపురంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. గతకొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇరువైపు పెద్దల అంగీకారంతో సాంప్రదాయ పద్ధతిలోనే వివాహం(Nayanathara Vignesh Shivan Wedding) చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌కి పలువురు సినీ సెలబ్రిటీలు, పొలిటికల్‌ లీడర్స్ ని, మీడియాని సైతం ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే నయనతార జంట తిరుపతిలోని తిరుమలలో శ్రీవారి సమక్షంలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో మ్యారేజ్‌ చేసుకున్న నెక్ట్స్ డేనే(శుక్రవారం) ఈ కొత్త జంట శ్రీవారిని దర్శించుకున్నారు. ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా వీరు శ్రీవారి మడ వీధుల్లో చెప్పులతో ఫోటో షూట్‌ చేయడం, అక్కడ తిరగడం ఇప్పుడు వివాదంగా మారింది. దీంతో దీనిపై టీటీడీ నయన్‌ జంటపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నయనతార జంట స్పందించి క్షమాపణలు చెప్పారు. 

పెళ్లైన ఆనందం కంటే ఈ వివాదమే ఎక్కువై పోవడంతో ఎట్టకేలకు సారీ చెప్పారు నయనతార, విఘ్నేష్‌ శివన్‌. ఈ మేరకు విఘ్నేష్‌ ఓ నోట్‌ని విడుదల చేశారు. `భగవంతుడిపై మాకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. తిరుమలలో స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాం. అదే పనిపై గడచిన నెల రోజుల్లో ఐదుసార్లు కొండకు వచ్చాం. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి మహాబలిపురంలో జరిగింది. పెళ్లి వేదిక నుంచి నేరుగా తిరుమల చేరుకున్నాం. స్వామి కల్యాణం వీక్షించి శుక్రవారం ఆశీస్సులు పొందాం.

 దర్శనం తర్వాత మా పెళ్లి ఇక్కడే జరిగిందన్న భావన కోసం, లైఫ్‌టైమ్‌ మాకు గుర్తుండేలా స్వామి ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్‌ చేసుకోవాలనుకున్నాం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి నుంచి వెళ్లి పోయి మళ్లీ తిరిగి వచ్చాం. త్వరగా ఫొటోషూట్‌ పూర్తి చేయాలనే కంగారులో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే సంగతి మరచిపోయాం. మేము భక్తితో కొలిచే ఆ స్వామి అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనను అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మా వల్ల జరిగిన పొరపాటుకు క్షమించమని కోరుతున్నాం` అని తెలిపారు. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరోవైపు నయనతార జంట చేసిన పనికి నెటిజన్ల నుంచి కూడా కొంత విమర్శలు వచ్చినా,ఇప్పుడు మరికొందరు ఆమెకి అండగా నిలుస్తున్నారు. `పెళ్లి చేసుకున్న తర్వాత మొదట స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చిన నూతన దంపతుల పట్ల టీటీడీ అధికారులు ధోరణి కరెక్ట్‌ కాదు. గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, వారి సిబ్బంది తిరుమల మాఢ వీధుల్లో చెప్పులతో తిరిగిన సందర్భాలున్నాయి. వారిని నిలదీయలేని అధికారులు బలహీనులపై ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు` అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios