Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: న‌వాబ్‌

ఒకప్పుడు మణిరత్నం సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇప్పటికీ దాదాపు సినీ ప్రేమికులంతా కూడా మణిరత్నం అభిమానులే. మధ్యలో ఆయన క్రేజ్ బాగా పడిపోయినా.. ఏ టైం లో వచ్చి ఎలాంటి హిట్ ఇస్తాడా..? అని చూసేవారు లేకపోలేదు.

nawab telugu movie review
Author
Hyderabad, First Published Sep 27, 2018, 4:43 PM IST

నటీనటులు: అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్, అదితి రావు‌ హైదరి త‌దిత‌రులు 
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: స‌ంతోశ్ శివ‌న్
ఎడిటింగ్: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ 
నిర్మాత‌లు: మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్
ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం

ఒకప్పుడు మణిరత్నం సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇప్పటికీ దాదాపు సినీ ప్రేమికులంతా కూడా మణిరత్నం అభిమానులే. మధ్యలో ఆయన క్రేజ్ బాగా పడిపోయినా.. ఏ టైం లో వచ్చి ఎలాంటి హిట్ ఇస్తాడా..? అని చూసేవారు లేకపోలేదు. తాజాగా ఆయన తెరకెక్కించిన 'నవాబ్' సినిమా ట్రైలర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది మణిరత్నం మార్క్ సినిమానో.. కాదో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
భూపతి(ప్రకాష్ రాజ్) సిటీలోనే అతి శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతాడు. అతడికి ముగ్గురు కొడుకులు వాళ్లే వరద(అరవింద స్వామి), త్యాగు(అరుణ్ విజయ్), రుద్ర(శింబు). వరదకి భార్య చిత్ర(జ్యోతిక)తో పాటు ప్రియురాలు(అతిథిరావు హైదరి) కూడా ఉంటుంది. వరదకి పోలీస్ ఆఫీసర్ రసూల్(విజయ్ సేతుపతి) బెస్ట్ ఫ్రెండ్. అతడిని బాగా నమ్ముతాడు. తండ్రిగా అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు వరద. మిగిలిన ఇద్దరు కొడుకులు విదేశాల్లో సెటిల్ అవుతారు. ఇంతలో భూపతి అతడి భార్యపై ఎటాక్ జరుగుతుంది.

తీవ్ర గాయాలతో భూపతి, అతడి భార్య బయటపడతారు.ఈ పని చేసింది భూపతి శత్రువు చిన్నప్ప(త్యాగరాజన్) అని అందరూ అనుమానిస్తుంటారు. కానీ తనపై మర్డర్ అటెంప్ట్ చేసిందెవరో తెలుసుకున్న భూపతి గుండెపోటుతో మరణిస్తాడు. దీంతో భూపతి స్థానం కోసం ముగ్గురు కొడుకుల మధ్య సంఘర్షణ మొదలవుతుంది. ఇంతకీ భూపతిని హత్య చేయాలనుకున్నది ఎవరు..? దానికి గల కారణాలు ఏంటి..? తండ్రి స్థానం కోసం పోటీ పడే ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి..? చివరికి ఎవరు గెలుస్తారు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

nawab telugu movie review

విశ్లేషణ: 
మాఫియా బ్యాక్ డ్రాప్, క్రైమ్ కథలను తెరకెక్కించడంలో దిట్టగా పేరు గాంచిన మణిరత్నం మరోసారి 'నవాబ్' కోసం అటువంటి కథనే ఎంపిక చేసుకున్నాడు. కుటుంబ నేపధ్యంలో సాగే ఆధిపత్య పోరుని తెరపై ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో మరోసారి తన ముద్ర వేశాడు మణిరత్నం. కథను పకడ్బందీగా రాసుకున్న ఆయన కథనంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. దీంతో సినిమాలో చాలా సన్నివేశాలలో సాగతీత ఎక్కువైంది. సినిమాలో మొదటి భాగాన్ని ఎంతో వేగంగా నడిపించిన ఆయన ద్వితీయార్ధాన్ని  మాత్రం బాగా సాగదీసి చూపించారు.

పతాక సన్నివేశాల్లో మినహా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆసక్తి లేకుండా సాగింది. ఈ తరహా సినిమాలకు ముఖ్యమైన వేగం ఈ సినిమా కాస్త మిస్ అయినట్లుగా అనిపించినా.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. మొదట గ్యాంగ్ వార్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో మొదలైన కథ.. సడెన్ గా అన్నదమ్ముల మధ్య ఆధిపత్యం పోరుగా మారుతుంది. సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తన భార్యతో హత్యాప్రయత్నం చేసింది శత్రువులు కాదని చెప్పే సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీను కలిగిస్తాయి. సినిమాలో ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉండడంతో ఏ పాత్ర ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ప్రేక్షకులు ఊహించలేరు.

nawab telugu movie review

సినిమాలో వరద పాత్రను ఇంకా బలంగా రాసుకొని ఉంటే బాగుండేదేమో.. అంతవరకు క్రూరమైన పనులు చేసిన వ్యక్తి మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉంటే ఆ పాత్రకి సరైన జస్టిఫికేషన్ ఉండేది. పెద్ద కొడుకు పాత్రలో అరవింద్ స్వామి నటనకి వంక పెట్టలేం. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా సెటిల్డ్ గా నటించారు. చాలా రోజుల తరువాత శింబుకి మంచి పాత్ర దక్కింది. తన అగ్రెసివ్ పెర్ఫార్మన్స్ తో రుద్ర అనే పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అరుణ్ విజయ్ చాలా స్టైలిష్ గా కనిపించారు. సినిమాకి ఈ ముగ్గురు అన్నదమ్ముల పాత్రలు ప్రాణం పోశాయి. 

జ్యోతిక ఇంటి పెద్ద కోడలిగా చక్కటి నటన కనబరిచింది. ఐశ్వర్యారాజేష్, డయానా పాత్రలకు ప్రాముఖ్యత పెద్దగా లేదనే చెప్పాలి. జయసుధ, త్యాగరాజన్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి నటన మరో హైలైట్. అతడి పరిచయ సన్నివేశాలు కామెడీ పుట్టిస్తాయి. పతాక సన్నివేశాల్లో విజయ్ నటన అభినందనీయం. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్థాయిలో మ్యూజిక్ లేదనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే నేపధ్య సంగీతం కట్టిపడేస్తుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వర్క్ ప్రతి ఫ్రేమ్ ని ఎంతో అందంగా చూపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా బావుండేది. ఈ సినిమా వరకు రచయితగా పర్వాలేదనిపించిన మణిరత్నం దర్శకుడిగా మాత్రం సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. 

రేటింగ్: 2.75/5   

Follow Us:
Download App:
  • android
  • ios