సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు.
సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్ర తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్.. వెంటనే బయలుదేరి రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయంతో నివాళులర్పించడంతో పాటు.. చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. నారా లోకేష్ వెంట బ్రహ్మణి కూడా ఉన్నారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను నారా లోకేష్ దంపతులు పరామర్శించారు.
ఇక, తారకరత్న మృతి నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అంత్యక్రియకలు పూర్తయ్యే వరకూ లోకేష్ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. మూడు రోజుల పాటు లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించినట్టుగా తెలుస్తోంది.
ఇక, తారకరత్న మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక తనకు వినిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న మృతి తమ కుటుంబానికి, టీడీపీకి తీరని లోటని అన్నారు. ‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’’ అని లోకేష్ పేర్కొన్నారు.
ఇక, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన తారకరత్న గుండెపోటుతో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుప్పం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తారకరత్నను నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదలయా ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే వచ్చారు. అయితే వైద్యులు తారకరత్నను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచి తారకరత్న శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
