ప్రస్తుతం  ‘టక్ జగదీష్’ సినిమా  చేస్తున్న నాని తన 27వ సినిమాని ‘టాక్సీవాలా’ వంటి కామెడీ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘అల వైకుంఠపురం’ చిత్రాన్ని నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు విజయవంతమైన సినిమాలను రూపొందించిన యంగ్ ఫిల్మ్ మేకర్ సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వీడియో సైతం  విడుదల చేశారు. అయితే ఇప్పుడు అనుకోని విధంగా నిర్మాతగా నాగ వంశీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  వెంకట్ బోయనపల్లి చేతికి ఈ సినిమా వెళ్లింది. 

దాంతో ‘జెర్సీ’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా తర్వాత మరోసారి హీరో నానితో సినిమా చేయబోతున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ఎందుకు తప్పుకున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘జెర్సీ’ తో నాగవంశీ లాభమేమీ తెచ్చుకోలేదట. బడ్జెట్ ఎక్కువ కావటంతో కొద్దిపాటి నష్టమే వచ్చిందిట. దాంతో సినిమా కమర్షియల్ ఫెయిలైనట్లైంది. ఈ నేపధ్యంలో అలాంటి తప్పు మరోసారి చెయ్యకూడదని నాగవంశీ నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా దర్శకుడు  రాహుల్ సంకృత్యాన్‌ ని బడ్జెట్ తగ్గించమని చెప్పారట. అయితే ఈ చిత్రానికి ఆ బడ్జెట్ అవసరం అవుతుందని నాని, దర్శకుడు ఇద్దరూ కూడా ఫీలయ్యారట. ఈ కారణంతో ..నాగ వంశీకి బై చెప్పి వెంకట్ బోయనపల్లి తో ప్రాజెక్టు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.

నాని హీరోగా నటిస్తున్న 27వ సినిమా ఇది. తొలి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్ నానిని సరికొత్తగా చూపిస్తూ, ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమాను రూపొందిచనున్నాడు. ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో రెండు ప్రేమకథలు ఉంటాయని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `టక్‌ జగదీష్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్‌ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం పూర్తి కాగానే.. `శ్యామ్‌ సింగ రాయ్’ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు నాని.