ఇటీవల కురిసిన అకాల వర్షాలు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌ సింగరాయ్‌` నిర్మాతల కొంప ముంచాయి. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌ డ్యామేజ్‌ అయినట్టు తెలుస్తుంది. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆ మధ్య హైదరాబాద్‌లో కోల్‌కత్తా సెట్‌ని వేశారు. దాదాపు పది ఎకరాల్లో ఆరున్నర కోట్లతో ఈ సెట్‌ని నిర్మించారు. 

కొంత భాగం ఇందులో షూటింగ్‌ జరిగింది. మరికొంత షూట్‌ చేయాల్సి ఉంది. ఈ లోపు కరోనా విజృంభనతో షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఈ కోల్ కత్తా సెట్‌ ధ్వంసమైనట్టు తెలుస్తుంది. చాలా వరకు డ్యామేజ్‌ అయ్యిందని, దాదాపు రెండు కోట్ల వరకు నష్టం జరిగిందనే టాక్‌ వినిపిస్తుంది. దీంతో `శ్యామ్‌ సింగరాయ్` నిర్మాతలకు అదనపు భారం పడనుందని టాక్‌ వినిపిస్తోంది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.