వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ నుండి... ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్రిస్మస్ కానుగా విడుదలైన టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. టక్ ఇన్ లో నీట్ గా ఉన్న నాని లుక్ క్లాస్ గా ఉంటే నేపథ్యం మాత్రం ఊర మాస్ గా ఉంది. వేట కూరతో అన్నం  తింటున్న నాని, వెనుక నుండి వేట కొడవలి తీయడం వెనుక కాన్సెప్ట్ ఏమిటనే క్యూరియాసిటీ కలిగిస్తుంది. పోస్టర్ నేపథ్యం చూస్తుంటే మూవీ మాస్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ అన్న భావన కలుగుతుంది. 

అలాగే మూవీ నేపథ్యం రాయలసీమలో సాగే అవకాశం కూడా కలదు. మొత్తంగా దర్శకుడు ఫస్ట్ లుక్ తో మూవీకి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నాని ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులను టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణకు టక్ జగదీశ్ మూడవ చిత్రం కాగా, నానితో రెండవ చిత్రం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన నిన్ను కోరి మంచి విజయాన్ని అందుకుంది. 

ఇక నాని క్లీన్ అండ్ కమర్షియల్ హిట్ అందుకోని చాలా రోజులు అవుతుంది. దీనితో టక్ జగదీశ్ విజయంపై నాని ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారి రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నానితో జతకడుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. నటుడు జగపతి బాబు టక్ జగదీశ్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.