'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం గ్యాంగ్ లీడర్. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నాని మార్క్ కామెడీ ఉంటూనే.. విక్రమ్ కుమార్ సినిమాల్లో ఉండే స్క్రీన్ ప్లేతో గ్యాంగ్ లీడర్ చిత్రం ఆకట్టుకోనుంది. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో నాని తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నాడు. 

గ్యాంగ్ లీడర్ చిత్రం యూనిట్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నాని మీడియా సమావేశంలో మాట్లాడాడు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు. తన ప్రతి కోసం ఎంతో బాధ్యతతో పనిచేస్తానని.. గ్యాంగ్ లీడర్ మనందరికీ ఇష్టమైన మెగాస్టార్ టైటిల్ కాబట్టి ఇంకా బాధ్యత పెరిగిందని నాని తెలిపాడు. 

గ్యాంగ్ లీడర్ టైటిల్ కు గౌరవాన్ని తెచ్చే విధంగానే ఈ చిత్రం ఉంటుందని నాని తెలిపాడు. గ్యాంగ్ లీడర్ చాలా సరదాగానే సాగే రివేంజ్ డ్రామా. జెర్సీ చిత్రంతో మిమ్మల్ని ఏడిపించినట్లున్నా.. అందుకే ఈ చిత్రంతో నవ్విస్తా అని నాని తెలిపాడు. టికెట్టు కొనుక్కుని వెళ్లే ప్రేక్షకుడిని నిరాశపరచని విధంగా గ్యాంగ్ లీడర్ చిత్రం ఉంటుందని నాని తెలిపాడు. 

గత ఏడాదే నాగార్జున గారితో దేవదాస్ మల్టీస్టారర్ చిత్రం చేశా. భవిష్యత్తులో మంచి కథ దొరికితే తన నుంచి మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని నాని తెలిపాడు.