మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `గ్యాంగ్‌లీడర్‌` సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను ఈ సినిమా రెట్టింపు చేసింది. తాజాగా అదే టైటిల్‌ను త‌న 24వ సినిమాకు పెట్టుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. విక్ర‌మ్ కే కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ‌కు `గ్యాంగ్‌లీడ‌ర్‌` టైటిలే క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని భావించి ఇలా చేసామని అన్నారు. అయితే ఇప్పుడా టైటిల్ వివాదం లో ఇరుక్కుంది. తమ టైటిల్ ని చట్ట విరుద్దంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మాణిక్యం మూవీస్ వారు ప్రెస్ మీట్ పెట్టారు. 

‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ను చాంబర్‌లో 6 నెలల క్రితమే రిజిస్టర్ చేయించడం జరిగింది. నేను చిరంజీవిగారి వీరాభిమానిని. ఆ టైటిల్ అనుకున్న తర్వాతనే కథ రెడీ చేశాం. ఈలోపు చట్ట విరుద్దంగా టైటిల్‌ను కాజేసే ప్రయత్నం చేసారు. ఈ విషయాన్ని ఫిల్మ్ చాంబర్ పెద్దల ముందుకు తీసుకొచ్చాము. ఆరు నురయినా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో సినిమా నిర్మిస్తామని హీరో, నిర్మాత మోహన్ కృష్ణ అన్నారు.

మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మాణిక్యం మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. ఉగాది నుండి గోదావరి జిల్లాలలో 40 రోజుల పాటు షూటింగు ప్లాన్ చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవిగారి పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.

చిరంజీవిగారు చేసిన సినిమా టైటిల్‌ను మా సినిమా టైటిల్‌గా ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. టైటిల్ హుందాతనానికి ఎక్కడా భంగం కలిగించకుండా చిత్రం నిర్మిస్తాము. దేశానికి వెన్నెముక అయిన రైతు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ చిత్ర కథనం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అడిగితే సంతోషంగా ఈ టైటిల్ ఇస్తాను. మరొకరికి ఇచ్చే సమస్యే లేదు..’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘1991లో చిరంజీవి చేసిన సూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్. హీరో మోహన్‌తో ఏడాదిగా ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాను. టైటిల్ పూర్తి హక్కులు మాణిక్యం మూవీస్‌వి..’’ అన్నారు.

ఇక గతంలో నాని..‘‘కళ్లకు ఏవియేటర్స్‌తో గడ్డం లుక్కుతో, చేతిలో గన్నుతో ఉన్న ఆయన్ని తెరమీద మొదటి రోజు, మొదటి షో చూసిన పిల్లాడిని నేను. మిగిలిందంతా హిస్టరీ. ఆయన టైటిల్‌నే ఇవాళ నేను ప్రకటిస్తున్నాను. నా 24వ చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్‌’ అని టైటిల్‌ పెట్టాం’’ అని నాని ట్వీట్‌ చేశారు.