నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. నాని చివరగా నటించిన జెర్సీ చిత్రంతో ప్రశంసలు దక్కించుకున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కించే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం రూపొందుతోంది. విక్రమ్ కుమార్ సినిమాలకు కాస్త బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశం గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ ని కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 24, హలో లాంటి చిత్రాలు బావున్నా కాస్ట్ ఫెయిల్యూర్ ఫిలిమ్స్ గా నిలిచాయి. గ్యాంగ్ లీడర్ చిత్రం విషయంలో విక్రమ్ కుమార్ నాని మార్కెట్ కు మించి ఖర్చు చేస్తున్నాడట. దీనితో నిర్మాతల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాని తాత్కాలికంగా గ్యాంగ్ లీడర్ షూటింగ్ నిలిపివేశాడట. 

సినిమా బడ్జెట్ తగ్గించేందుకు అనవసరమైన సన్నివేశాలని తొలగించాలని, ఆ దిశగా కొన్ని రోజులపాటు స్క్రిప్ట్ పై వర్క్ చేయమని దర్శకుడిని నాని ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాని, విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మనం, ఇష్క్ చిత్రాలతో విక్రమ్ కుమార్ చేసిన మ్యాజిక్ గ్యాంగ్ లీడర్ లో రిపీట్ అవుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.