తెలంగాణాలో ఇంటర్మీడియట్ బోర్డ్, కొందరు అధికారుల తప్పిదాల కారణంగా కొందరు విద్యార్ధులు ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్ధుల బలవన్మరణాలు అగ్గిరాజేస్తున్నాయి. దీనంతటికీ కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన కొందరు విద్యార్ధులు ప్రాణాలు తీసుకోవడం పట్ల టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, హీరో రామ్, దర్శకుడు మారుతి ఇలా కొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు.

తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా ఈ విషయంపై స్పందించారు. చదువంటే మార్కుల షీట్ మీద నంబర్ కాదని.. నేర్చుకోవడమని అన్నారు. మీరు అనుకున్నది సాధించలేకపోయినప్పుడు మళ్లీ ప్రయత్నించాలని, పోరాడాలని.. ఆ ప్రయత్నం వృధాగా పోదని విధ్యార్ధులను ఉద్దేశించి అన్నారు.

వీటన్నినికంటే జీవితం చాలా విలువైనదని.. మీ తల్లితండ్రులు, మిమ్మల్ని ప్రేమించేవారు కోసం ఒక్కసారి ఆలోచించండంటూ సూచించాడు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసి వారు మిమ్మల్ని ప్రేమించరని, మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తారని తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.