Asianet News TeluguAsianet News Telugu

జెర్సీ రివ్యూ: స్ఫూర్తినిచ్చే సిక్సర్

తెలుగు సినిమా మెల్లిగా మారుతోంది. కొత్త నేపధ్యాలు, సరికొత్త భావోద్వేగాలను ఆహ్వానిస్తోంది..తెరపై ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి కథ తెరపై చెప్పబోతున్నాం అనే దాని కన్నా దాన్ని ఎంతలా మనస్సుకు హత్తుకునేలా చెప్తాము అనేది డైరక్టర్స్ కు టాస్క్ గా మారింది. ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ని  ఎలా డీల్ చేసారు...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Nani Jersey movie review
Author
Hyderabad, First Published Apr 19, 2019, 11:47 AM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

తెలుగు సినిమా మెల్లిగా మారుతోంది. కొత్త నేపధ్యాలు, సరికొత్త భావోద్వేగాలను ఆహ్వానిస్తోంది..తెరపై ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి కథ తెరపై చెప్పబోతున్నాం అనే దాని కన్నా దాన్ని ఎంతలా మనస్సుకు హత్తుకునేలా చెప్తాము అనేది డైరక్టర్స్ కు టాస్క్ గా మారింది. హీరో కన్నా డైరక్టరే ప్రతీ ఫ్రేమ్  లో కనపడాల్సిన సిట్యువేషన్.  ఇలాంటి మారుతున్న సంథి కాలంలో మంచి  అంచనాలతో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏ మేరకు సగటు ప్రేక్షకుడుని ఆకట్టుకుంటుంది...క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రీసెంట్ గా వచ్చిన మజిలీతో పోలిక ఉందా...అసలు కథేంటి? ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ని  ఎలా డీల్ చేసారు...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి:

అర్జున్ (నాని) కు క్రికెట్ అంటే పంచప్రాణాలు. అతను సారా (శ్రద్దా శ్రీనాధ్) అనే ఓ క్రిష్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె కుటుంబం వీరి వివాహానికి ఒప్పుకోకపోవటంతో ...అందరినీ కాదనుకుని బయిటకు వచ్చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అర్జున్ క్రికెట్ ఆడటం మానేసి (ఆ కారణం ఏంటన్నదే కథకు కీలకం) తన భార్య సంపాదనతో బ్రతుకు ఈడుస్తూంటాడు. వాళ్లకో అబ్బాయి పేరు నాని . వాడు క్రికెట్ అభిమానే. బాబు పుట్టాక వాడి తోడిదే లోకం అయ్యిపోతాడు అర్జున్.  కానీ సంపాదన లేకపోవటం, తను అనుకున్న కెరీర్ దొరక్క పోవటంతో ఓ రకమైన నిరాశ అతన్ని ఆక్రమిస్తుంది. ఆర్దిక కారణాలు అతన్ని మరింతగా విసిగిస్తాయి. 

తన కొడుకు పుట్టిన రోజుకు గిప్ట్ గా ఓ ఐదు వందలు పెట్టి    క్రికెట్ జెర్శి కొనలేకపోవటం బాధిస్తుంది. దాంతో తన కొడుక్కి జెర్శిని గిప్ట్ గా ఇవ్వటం కోసం ఓ ఛారిటీ గమ్ దాదాపు పదేళ్ల తర్వాత ఆడటానికి సిద్దపడతాడు. ఆ ఆటలో అర్జున్ అద్బుతంగా ఆడతాడు. కానీ గెలవలేకపోతాడు..గిప్ట్ ఇవ్వలేకపోతాడు. అయితేనేం అతనిలో చిన్న ఉత్సాహం వస్తుంది. తనలో సత్తా ఇంకా మిగిలే ఉందనే ధైర్యం వస్తుంది. అప్పటికి 36 ఏళ్లు వచ్చేసాయి. అయినా సరే మళ్లీ క్రికెటర్ గా ఫీల్డ్ కు వెళ్లాలనుకుంటాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ తరుపున ఆడాలనుకుని నిశ్చయించుకుంటాడు.   అక్కడ నుంచి మళ్ళీ అర్జున్ జీవితానికో లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యాన్ని అర్జున్ ఫుల్ ఫిల్ చేయగలిగాడా...మిడిల్ ఏజ్ లో చేస్తున్న అతని ప్రయత్నాలకు ఏ అడ్డంకులు వచ్చాయి.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

స్క్రీన్ ప్లే..క్యారక్టర్స్ 

అర్జున్ అనే క్రికెటర్ 26 ఏళ్ల వయసులోనే ఆటకు  గుడ్ బై చెప్పి...మళ్లీ పదేళ్ల తర్వాత ఎందుకు బ్యాట్ చేతబట్టాడు, ఏం సాధించాడు అనే విషయం చుట్టూ తిరుగుతుంది.  స్టోరీ లైన్ చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. కానీ దాన్ని స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ రైడ్ గా మార్చటం మాత్రం ముచ్చటేస్తుంది. ముఖ్యంగా కథని  1986 .. 1996.. 2018 సంవత్సరాలలో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. అలాగే  అర్జున్ జీవితంపై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి, . అత‌డి కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేయ‌డం  స్క్రిప్టు జిమ్మిక్కే. అదే సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఆస్కార్ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ...ఇలాగే తన తండ్రి కథని  కొడుకు చెప్తాడు. తండ్రి కథను కొడుకు తప్ప ఇంకెవరు అంత గొప్పగా నేరేట్ చేయగలరు. అలాగే క్యారక్టర్స్ ఎంత నీట్ గా రాసుకున్నాడంటే...ప్రేమ పెళ్లిలో వచ్చే ప్లాబ్లంస్ ని  అర్జున్ – సారా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిస్తాడు. అలాగే హీరో విల్ పవర్ ని సరిగ్గా ప్రొజెక్టు చేసి మనలోనూ స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తాడు. 

ఐడింటిఫికేషన్

అండర్ డాగ్  కథలు ...జీవితంలో పడి లేచే కథలు ఎప్పుడూ ఇంట్రస్టింగే. రకరకాల రీజన్స్ తో తాము అనుకున్న  కెరీర్ లో ముందుకు వెళ్లలేని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లు వేరే కెరీర్ లో సక్సెస్ కావచ్చు కానీ ఆ ఆవేదన  మనస్సులో ఏదో మూల అలా ఉండిపోతుంది. అ తడిని పట్టి లేపుతుందీ సినిమా. వారు ఈ సినిమాని ఐడింటిఫై చేసుకుని...హీరో  పాత్రలో తమను తాము చూసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అలా ఐడింటిఫై చేసుకునేవాళ్లు ఎంత మంది ఉంటారు అన్న విషయమై ఈ సినిమా సక్సెస్ స్దాయి ఆధారపడుతుంది.

'మజిలి' తో పోలిక

రీసెంట్ గా వచ్చిన నాగచైతన్య మజిలి చిత్రం సైతం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. అందులోను ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో జరిగే  దశాబ్దకాలం క్రితం కథ,  ఫ్యామిలీ ఎమోషన్స్  ఉన్నాయి. అయితే ఆ సినిమాకు ...జెర్సీకు తేడా ఏంటంటే...జెర్శి  పట్టుదల ఉంటే లక్ష్యానికి వయస్సుతో నిమిత్తం లేదని  ఓ జెనరేషన్ కు  స్పూర్తినిచ్చే కథ. మజలి...కొన్ని మర్చిపోకపోతే మరికొన్ని మిస్సైపోతాం అని హెచ్చరించే కథ. రెండూ వేర్వేరు.

డైరక్టర్ సినిమా

ఈ సినిమా పూర్తిగా దర్శకుడు ప్రతిభా ప్రదర్శన అనే చెప్పాలి. ఎందుకంటే ఇదే కథను వేరే దర్శకుడు డీల్ చేస్తే ఇంత నైపుణ్యంతో నడపలేడు. వేరే కమర్షియల్ ఎలిమెంట్స్ తెచ్చి విషయాన్ని పలుచన చేసేసేవాడు. ముఖ్యంగా నటుడుగా నాని బలాలు, బలహీనతలను కరెక్ట్ అంచనా వేసి ఆ కొలతల్లోనే  సినిమాని పరుగెట్టించాడు. జీవితంలో ఇంకేమీ చెయ్యలేము అనుకుని మిడిల్ లైఫ్ క్రైసిస్ ని ఎదుర్కొనే వ్యక్తి....మళ్లీ తనను ప్రూవ్ చేసుకుని తనకు ఆత్మధైర్యాన్ని, తన కొడుక్కు  గర్వాన్ని గిప్ట్ గా అందిస్తాడు అనేది చూపించటంలో  డైరక్టర్ పూర్తి గా సక్సెస్ అయ్యాడు.

స్లోగా...రిపీటెడ్ గా

అన్ని బాగానే ఉన్నా  ఈ సినిమాని స్లో పేసెడ్ గా నడపటం  మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే క్రికెట్ సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ తెస్తాయి.  లెంగ్త్ కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. 

జాగ్రత్తలు

స్క్రిప్టుని ఎంత బాగా రాసుకున్నా అతి తెరపైకి ఎక్కే క్రమంలో తడబడితే మొత్తం తగలడుతుంది. అయితే దర్శకుడు గౌతమ్... తండ్రి కొడుకుల ట్రాక్ ని, భార్య భర్తల ట్రాక్ ని చాలా బాగా తెరకెక్కించాడు. దానికి తోడు క్రికెట్ మ్యాచ్ లు రియల్ గా అనిపించటానికి జూనియర్ ఆర్టిస్ట్ లను కాకుండా రియల్ క్రికెటర్స్ ని హైదరాబాద్ క్రికెట్ అశోశియోషన్ నుంచి తీసుకు వచ్చి నటింప చేసారు. క్లైమాక్స్ సినిమాని నిలబెట్టేలా పూర్తి జాగ్రత్తలు తీసుకునని తెరకెక్కించారు. 

సరికొత్త నాని

నాని ..న్యాచురల్ స్టార్ అన్నదానికి న్యాయం చేసారు. ఇంతకు ముందు కామెడీ చేసే నాని యేనా ..ఈ క్రికెటర్ నాని అనిపిస్తుంది.  ఈ సినిమాతో మనముందు ఒక సరికొత్త నాని ఆవిష్కృతం అయ్యాడు.  అలాగే కోచ్ గా సత్యరాజ్ , నాని కొడుకు గా క్రమా పోటీపడి ఫెరఫామ్ చేసారు.

సాంకేతికంగా...

ఈ సినిమాలో డైరక్టర్ తర్వాత మెచ్చుకోవాల్సింది ఆర్ట్ డైరక్టర్ ని.  ఎనభైల నాటి ఇళ్లని, వీధులని, క్రికెట్ స్టేడియమ్ ని  కళ్లకు కట్టారు. అలాగే ఆ జనరేషన్  కాస్ట్యూమ్స్ ని సైతం చాలా నీటుగా ప్రజెంట్ చేసారు. అలాగే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సీన్స్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఇక  కెమెరా వర్క్ సైతం మరో ఎస్సెట్. డైలాగులు నీటుగా సీన్స్ , క్యారక్టరైజేషన్స్ కు తగినట్లు ఉన్నాయి..

 “నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్లా లేదు” , “ఇంతపెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చెయ్యంది నా కొడుకొక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను” వంటి ట్రైలర్ లో ఇంతకు ముందే వచ్చిన డైలాగ్స్ కు ధియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎడిటింగ్ సెకండాఫ్ ని మరింత క్రిస్ప్ గా చేయచ్చు అనిపించింది. 

ఫైనల్ ధాట్

నటుడుగా నాని తన సహజ నటనలో   సిక్సర్స్  కొట్టి గెలిస్తే....దర్శకుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఓ మిడిల్ ఏజ్ క్రైసిస్ ని స్పూర్తివంతమైన కథగా సినిమాని తీర్చిదిద్ది 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచారు. 

Rating:3.5/5

 

Follow Us:
Download App:
  • android
  • ios