విజయాల పరంగా వెనుకబడ్డ హీరో నాని, కలిసొచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో నాని-శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి చిత్రం విజయాన్ని అందుకుంది. అలాగే శివ నిర్వాణ గత చిత్రం మజిలీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో టక్ జగదీశ్ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కాగా నేడు ఈ చిత్రం నుండి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆయుధం తీసుకొని యాక్షన్ దుమ్మురేపుతున్నట్లున్న నాని లుక్ ఆసక్తి రేపుతోంది. మోషన్ పోస్టర్ టక్ జగదీష్ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇక టక్ జగదీష్ టీజర్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఫిబ్రవరి 23న ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. 

షైన్ స్రీన్స్ పతాకంపై తెరకెక్కుతున్న టక్ జగదీష్ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని గత చిత్రం వి భారీ అంచనాల మధ్య ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. దీనితో టక్ జగదీష్ ద్వారా భారీ హిట్ కొట్టాలని నాని భావిస్తున్నారు.