జాతీయ అవార్డులపై నాని పోస్ట్ వివాదం.. అందరి ముందు వివరణ ఇచ్చిన నేచురల్ స్టార్
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులపై నాని చేసిన పోస్ట్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా నాని వివరణ ఇచ్చారు. జాతీయ మీడియా వేదికగా అసలు విషయం చెప్పారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకి అత్యధికంగా జాతీయ అవార్డులు వరించాయి. ఏకంగా పది అవార్డులు రావడం ఇదే మొదటిసారి. ఇదొక సంచలనమనే చెప్పాలి. అంతేకాదు మొదటిసారి తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం మరో రికార్డ్. దీంతో టాలీవుడ్ మొత్తం గర్విస్తుంది. అయితే ఆ సమయంలో నాని(Nani) చేసిన పోస్ట్ వివాదంగా మారింది. జాతీయ అవార్డు(National Awards) వచ్చిన తెలుగు సినిమాలకు, టెక్నీషియన్లకి ఆయన అభినందనలు తెలిపారు.
అదే సమయంలో `జైభీమ్` వంటి సినిమాకు అవార్డులు రాకపోవడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. తెలుగువారికి ఇన్ని అవార్డులొచ్చాయి, మొదటిసారి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు వచ్చింది. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి, గర్వపడాల్సింది పోయి ఇలాంటి కామెంట్ చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. నాని అసహనం రకరకాలుగా స్ప్రెడ్ అయ్యింది.
తాజాగా నాని దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో ప్రముఖ నేషనల్ మీడియా `ఇండియా టుడే` నిర్వహించిన `తెలంగాణ రౌండ్‌టేబుల్` డిబేట్‌లో నాని పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో పాల్గొన్న నటుడిగా నాని రికార్డు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా నేషనల్ అవార్డులపై ఆయన పెట్టిన పోస్ట్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి వివరణ ఇచ్చాడు నాని. తన అసలు ఉద్దేశ్యం ఏంటో వివరించే ప్రయత్నం చేశారు.
తాను తెలుగు వారికి జాతీయ అవార్డులు వచ్చినందుకు వారిని అభినందిస్తూ పోస్ట్ పెట్టానని తెలిపారు. మొదట మన తెలుగు వారి గురించి, అవార్డులకు ఎంపికైన ప్రతి ఒక్కరి గురించి మెన్షన్ చేశానని, అలాగే నా సోదరుడు బన్నీకి అవార్డు రావడం, దేవిశ్రీ ప్రసాద్ కూడా నేషనల్ అవార్డుకి ఎంపిక కావడాన్ని ఆనందిస్తూ అభినందిస్తూ పోస్ట్ పెట్టానని, అదే సమయంలో `జైభీమ్` సినిమాకి అవార్డు రానందుకు బాధపడుతూ ఆ పోస్ట్ పెట్టానని చెప్పారు. ఇక్కడ తెలుగు వారిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదని, కానీ ఆ సినిమా కూడా అవార్డు వస్తే బాగుంటుందని, దానికి అంత వర్త్ ఉందని ఆయన చెప్పారు. దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు నాని.
ఇండియాలో బెస్ట్ ప్లేస్‌లో హైదరాబాద్ ఒకటని, ఇక్కడ అన్ని రకాల మనుషులుంటారని, అన్ని కల్చర్స్ కి వేదిక అని, జీవన విధానం, కట్టుబట్టా, ఇలా ప్రతిది మేళవిపుంగా ఉంటుందని తెలిపారు. ఇక్కడి మనుషులు చాలా ఓపెన్‌గా ఉంటారని వెల్లడించారు. ఇక తాను బయటకు వెళితే ఏం వెంట తీసుకెళ్తారనే ప్రశ్నకి, ఫోన్,ఛార్జర్, గ్లాసెస్, ఇయర్ బగ్స్ ఉంటాయని, చాలా సార్లు వాళ్లమ్మ చిన్న టిఫిన్ పంపిస్తుందని, ఏ సీచ్చువేషన్‌లో అయినా, తాను తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, బయట తినడం ఇష్టం లేక ఈ టిఫిన్ తినమని బాక్స్ పంపిస్తుందని వెల్లడించారు నాని.