'బంధం రేగడ్‌' అనే ఇండిపెండెంట్‌ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు సాహిత్‌ మోత్‌కూరి. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం 'సవారి'తో తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందు, ప్రియాంక శర్మ జంటగా నటించారు.  తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నందు ఓ గుర్రాన్ని పెంచుతూ, దాని ద్వారా వచ్చిన డబ్బుతో జీవిస్తూ కనిపించారు. 

ఆ గుర్రం పేరు బాద్షా. దానికి అండగా తోడుగా స్నేహితుడిగా కాచుకునే ఉండే కాపరి రాజు(నందు). అనుకోకుండా ఓ సందర్భంలో పెళ్లి నుంచి తప్పించుకుని వచ్చిన భాగి(ప్రియాంక శర్మ)తో నందుకి అతని గుర్రానికి స్నేహం ఏర్పడుతుంది.  మరోవైపు భాగి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో పాటు కాళి అనే రౌడీ గ్యాంగ్ వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తాయి. 

ఇక అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. నందుకి భాగికి మధ్య ప్రేమ మొదలవుతుంది.  ఈ కథకు గుర్రానికి సవారి మీద బ్రతికే రాజుకు రౌడీ గ్యాంగ్ తో క్లాష్ ఎందుకు వచ్చింది అనేదే కథలో కీలకమైన పాయింట్. ఇక టీజర్‌లోని ఓ సన్నివేశంలో రౌడీలు భర్తను చావగొడుతున్నా.. మహిళ సీరియస్‌గా సీరియల్‌ చూస్తూ కూర్చోవడం ఫన్నీగా అనిపించింది. 

‘ఏం పెళ్లాం రా.. మొగుడ్ని ఇంతగా కొడుతుంటే సీరియల్‌ చూస్తోంది..’ అని సాగే డైలాగ్‌తో సీన్‌ జోక్‌గా సాగింది. ‘సవారి’ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మోనిష్‌ భూపతిరాజు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.