బావ బావమరిది.. నంది అవార్డు. అందుకే ఈ విమర్శలు

First Published 15, Nov 2017, 2:03 PM IST
nandi awards list creating buzz on social media trolls to ap govt
Highlights
  • నంది అవార్డుల ఎంపికపై విమర్శలు
  • లెజెండ్ చిత్రానికి అవార్డు పై సోషల్ మీడియాలో ట్రోల్స్
  • దానికంటే మంచి సినిమా వుండగా అవార్డు ప్రకటించారంటున్న నెటిజన్లు
  • బావ అధికారంలో వున్నందుకు, బావమరిది కమిటీలో వున్నందుకేనని విమర్శలు

గతంలో నంది అవార్డులకు సంబంధించి ఓ పెనుదుమారం రేగింది. అలా కాలక్రమంలో దాన్ని మరిచిపోయిన వాళ్లందరికీ మళ్లీ తాజా నంది అవార్డుల ప్రకటన ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. నంది అవార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారనే దానికి ఓ కొలమానం లేకున్నా, కొన్ని సందర్భాల్లో అనుకున్న సినిమాలకు అవార్డులు  రావు, అనుకోని సినిమాలకు తెలియకుండానే అవార్డులు వరిస్తాయి. అది నంది ప్రత్యేకత. ప్రభుత్వ పరంగా ఇచ్చే అవార్డు కదా ఆ మాత్రం పాలిటిక్స్ వుంటాయి మరి. ఇక విషయంలోకి వద్దాం.

 

ఈసారి నంది అవార్దుల జ్యూరీలో బాలయ్య కూడా ఉన్నాడు. విశేషం అది కాదు. ఈ సారి లిస్ట్ లో బాలయ్య సినిమాకి మూడు నందులు రావటం. దీనిపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్యకు ఇలాంటి కాంట్రవర్సీలు కొత్త కాదు. విమర్శ ఏదైనా సరే, ఎవరు చేసినా సరే.. ఎనీ టైమ్.. ఎనీ సెంటర్.. విమర్శలను తిప్పికొట్టడం బాలయ్యకు కూడా అలవాటైపోయింది. ఎందుకంటే అవి వస్తాయి మరి.

 

గతంలో నరసింహ నాయుడు సినిమాకు నంది వచ్చిన సమయంలో కూడా విమర్శలు వచ్చాయి. బావ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బావమరిది బాలయ్యకు అవార్డులు దక్కటం సహజం అనేది దానికి సమాధానం. నరసింహనాయుడు సినిమా కమర్షియల్ గా హిట్టే.. కానీ అందులో బాలయ్య నటనకు నందీ అవార్డు దక్కడం మాత్రం విడ్డూరం అనిపించుకుంది. ఆ యేడు ఆ మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్లు బోలెడన్ని వచ్చాయి. అయితే అప్పట్లో వచ్చిన విమర్శలకు నంది అవార్డుల కమిటీ సమాధానం ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలో వున్నారు. దీంతో బావ చేతిలో అధికారం, బాలయ్య చేతిలో అవార్డు.. అనే అంశం తెరపైకి వచ్చింది.

 

ఈ సారి నంది అవార్డుల జాబితాలో ‘లెజెండ్' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఇదంతా.. బావ చేతిలో అధికారం పుణ్యమే అనే మాట గట్టిగా వినిపిస్తోంది. అప్పట్లో నరసింహనాయుడు ఎలాంటి యాక్షన్ ఎంటర్ టైనరో, లెజెండ్ కూడా అలాంటి యాక్షన్ ఎంటర్ టైనరే. గతంలో నంది వరించిన ప్రభాస్ మిర్చీ కూడా ఈ తరహా సినిమానే. ఇవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలు. నంది అవార్డులు ఇలాంటి సినిమాలకే ఇస్తారేమో మరి. ఏదేమైనా లెజెండ్ కు అవార్డులు రావటం మాత్రం బావ చేతిలో అధికారం... అంటూ పిలింనగర్ లో చరిచ జరుగుతోంది. ఎందుకంటే ఆ యేడు రిలీజైన నాగార్జున మనం సినిమా లెజెండ్ సినిమాకంటే నూరుపాళ్లు మెరుగని విమర్శకులేకాక ప్రేక్షకులు తేల్చేశారు. మరి అవార్డుల కమిటీ ఇలా ఎందుకు తేల్చిందో అర్థమవుతోంది కదా. ఏమంటారు.

loader