తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ఎక్మో అసలు పెట్టలేదు: నందమూరి రామకృష్ణ
ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్తా మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. తారకరత్న తప్పకుండా నవ్వుతూ బయటకు వస్తారని అన్నారు. కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీడీపీ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చి తారకరత్నను పరామర్శిస్తున్నారు.
ఈరోజు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన నందమూరి రామకృష్ణ.. అక్కడి నుంచి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్తా మెరుగుపడుతుందని తెలిపారు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చెప్పారు. కొంతమేర ఆయనకు ఆయనే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. బ్రెయిన్‌కు పనితీరుపై సీటీ స్కాన్ రిపోర్టు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని అన్నారు. సీటీ స్కాన్ చేశారని.. ఇంకా ఆ రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. అందుకే దాని గురించి ఏం చెప్పలేమని అన్నారు.
Also Read: తారకరత్నను పరామర్శించిన జూ. ఎన్టీఆర్.. ఆయన కోసం రాష్ట్ర మంత్రిని పంపిన కర్ణాటక సీఎం..!
అయితే న్యూరో అనేది రాత్రికి రాత్రే రికవరీ అయ్యేది కాదన్నారు. దానికి సమయం పడుతుందని చెప్పారు. తప్పకుండా సాధారణ పరిస్థితికి వస్తారని అన్నారు. నందమూరి తారకరామరావుతో పాటు, అభిమానుల అందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరారు. ఏక్మో అసలు పెట్టలేదని చెప్పారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు.
ఇక, తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి నారాయణ హృదయాలయ ఆస్పత్రి శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఇక, ఈరోజు కూడా తారకరత్నకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై.. తాజా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.