కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. 

ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాల సందడి కనిపిస్తుంది.  ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రాబోతున్నాడు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంతో రాబోతున్నాడు. ఇండియన్ సూపర్ స్టార్ రజని నటిస్తున్న దార్బార్ కూడా సంక్రాంతికే రానుంది. 

ఇలాంటి బడా హీరోల చిత్రాలకు పోటీగా కళ్యాణ్ రామ్ సంక్రాంతి బరిలోకి దిగుతుండడం ఆసక్తిగా మారింది. చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ ఎంత మంచివాడవురా చిత్రాన్ని జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 

సంక్రాంతి సెలవులకి ఉపయోగించుకునేందుకు కళ్యాణ్ రామ్ నిర్మాతలని ఒప్పించినట్లు సమాచారం. సంక్రాంతికి ఎన్ని చిత్రాలు విడుదలైనా కంటెంట్ బావుంటే వసూళ్లు తప్పకుండా వస్తాయి. కళ్యాణ్ రామ్ కూడా ఇదే నమ్ముతున్నట్లు తెలుస్తోంది.  గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.