ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘనవిజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు కూడా స్వీకరించారు. జగన్ తన కేబినెట్ లో మంత్రులుగా ఎవరిని తీసుకుంటారు అనే ఉత్కంఠకు తెరపడింది. అన్ని సామాజికవర్గాలు ప్రాధాన్యతనిస్తూ జగన్ 25 మంత్రులని ఖరారు చేశారు. వైసిపిలో కీలక నేతగా నగిరి ఎమ్మెల్యే రోజా హైలైట్ అవుతూ వచ్చారు. 

వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజాకు మంత్రి పదవి ఖాయం అంటూ ఊహాగానాలు వినిపించాయి. మరికొందరైతే రోజాకు జగన్ హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా అంచనా వేశారు. అన్ని అంచనాలు తప్పాయి. మంత్రుల జాబితాలో రోజా పేరు లేదు. రోజాకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. భవిష్యత్తులో మంత్రి వర్గ విస్తరణ చేస్తే రోజాకు అవకాశం ఉంటుందేమో. ప్రస్తుతానికి ఆమె కేవలం ఎమ్మెల్యే మాత్రమే. 

రోజా సినీ సెలెబ్రిటీ కావడంతో మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో చెలరేగారు. ఈ క్రమంలోనే రోజాపై అంచనాలు పెరిగాయి. నగిరి నియోజకవర్గంలో తీవ్రమైన పోటీని అధికమించి రోజా రెండవసారి విజయం సాధించారు. రోజాకు మంత్రి పదవి ఖాయమని.. ఇక ఆమె జబర్దస్త్ షోకు దూరం కాక తప్పదని ఊహాగానాలు వినిపించాయి. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ అంటే రోజా, నాగబాబు వెంటనే గుర్తుకు వచ్చే విధంగా వీరిద్దరూ పాపులర్ అయ్యారు. 

ఒక రకంగా రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం జబర్దస్త్ అభిమానులకు గుడ్ న్యూసే. మరి కొంత కాలం పాటు వీరిద్దరూ జబర్దస్త్ లో న్యాయ నిర్ణేతగా కొనసాగే అవకాశం ఉంది. ఇక రోజాకు జగన్ పార్టీ పరంగా ఏదైనా కీలక భాద్యతలు అప్పగిస్తే జబర్దస్త్ విషయంలో రోజా నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.