ఇటీవల వరుసగా స్టార్స్ అందరు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` రాకతో మిగిలిన హీరోలంతా ఏడాది మొత్తంలో వివిధ డేట్స్ లను ఫిక్స్ చేసుకున్నారు. సీనియర్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరు తమ సినిమాలను రిలీజ్‌ డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక మిగిలింది సీరియర్‌ హీరోల్లో నాగార్జున ఒక్కడే. ప్రభాస్‌ కూడా విడుదల తేదీలను ప్రకటించలేదు. కానీ `రాధేశ్యామ్‌`ని ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని కృష్ణంరాజు చెప్పారు. అలాగే `సలార్‌`ని కూడా ఈఏడాదిలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్‌పై ఒత్తిడి పెరిగింది. తనయులు నాగచైతన్య, అఖిల్‌ సినిమాల డేట్స్ ఫిక్స్ అయ్యాయి. కానీ నాగ్‌ మాత్రం ఇంకా తాను నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. సోలమాన్‌ దర్శకత్వంలో నాగ్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా ఏసీపీ విజయ్‌వర్మగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌పూర్తయ్యింది. అయితే ఈ సినిమాని మొదట నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయాలని భావించారు. దాదాపు డీల్‌ కూడా కుదిరిందనే వార్త వచ్చింది. రిపబ్లిక్‌డేకే రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. 

ఇటీవల థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్లని రాబట్టాయి. ఇప్పుడు కేంద్రం ఏకంగా వంద శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో తన సినిమాని కూడా థియేటర్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట నాగ్. దీంతో ఎప్పుడు విడుదల చేయాలనేది ఓ భాగమైతే, నెట్‌ఫ్లిక్స్ తో ఉన్న డీల్‌ మరో సమస్యగా మారింది. దీంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నట్టు టాక్‌. మొత్తానికి థియేటర్‌లోనే సినిమాని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు అందరు హీరోలు సినిమాల విడుదలలు ప్రకటించడంతో నాగ్‌ ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అదే సమయంలో నాగ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఎప్పుడు ప్రకటిస్తారనేదానిపై సస్పెన్స్ నెలకొంది.