నాగార్జున కొత్త సినిమాని ప్రారంభించారు. `గరుడవేగ` వంటి హిట్‌ సినిమాని రూపొందించిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే నయా మూవీ మంగళవారం సికింద్రాబాద్ శ్రీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ములో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.  ముహూర్త‌పు స‌న్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి మినిస్ట‌ర్ శ్రీ త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ క్లాప్ కొట్ట‌గా, ప్రముఖ ఎగ్జిబిట‌ర్ స‌దానంద గౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ ప్రై.లి పతాకాలపై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీన్ని భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. 

నాగార్జున మాట్లాడుతూ, `నిన్న‌నే హిందీ సినిమా  `బ్రహ్మాస్త్ర` షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చాను. ఆ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ గారు, ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా బ‌ట్ న‌టిస్తున్నారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శకత్వంలో క‌ర‌ణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో నా సినిమా ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. సినిమా టైటిల్ ఇంకా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో  ఇలాంటి ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి చాలా రోజులు అయింది. లండ‌న్‌, ఊటీ, గోవా, హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు` అని తెలిపారు.  

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు చెబుతూ, `నాగార్జున హీరోగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి మా టీమ్ అంద‌రం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉన్నాం. ఇదొక స్టైలిష్ యాక్ష‌న్ ఫిల్మ్. ఈ సినిమాలో న‌టించే ఇత‌ర నటీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం` అని చెప్పగా,  ప్ర‌ముఖ నిర్మాత పుస్కూర్ రామ్మోహ‌న్ రావు మాట్లాడుతూ, `నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో నేను, సునీల్ నారంగ్‌, శ‌ర‌త్ మ‌రార్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హైద‌రాబాద్‌లో ప‌దిరోజుల పాటు షూటింగ్ జ‌రిపి మార్చిలో గోవాలో 15రోజులు షూటింగ్‌ ప్లాన్ చేశాం. ఆ త‌ర్వాత ఊటీ, లండ‌న్‌లో షూటింగ్ జ‌రుప‌నున్నాం. వీటితోపాటు సౌత్ కొరియాలో నాలుగు రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. నాగార్జున కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది` అని చెప్పారు. ప్రస్తుతం నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.