`ఉప్పెన` సినిమాతో సూపర్‌ హిట్‌ని అందుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే రికార్డ్ సృష్టించాడు. ఓ డెబ్యూ హీరో సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేయడం టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్‌. అలా వైష్ణవ్‌ తేజ్‌ ఎంట్రీతోనే సంచలనంగా మారిపోయాడు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 12న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదొక సెన్సేషనల్‌ మూవీగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఇదిలా ఉంటే అప్పుడే మూడో సినిమా కూడా సెట్‌ అయ్యిందని తెలుస్తుంది. వైష్ణవ్‌తేజ్‌తో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడితో వైష్ణవ్‌తో సినిమా చేయాలని నిర్ణయించారట. దాదాపు ఇది ఖరారైందని టాక్‌. జులైలో సినిమా ప్రారంభం కానుందని టాక్‌.