అక్కినేని నాగార్జున సోదరిపై ఆరోపణలు.. కేసు నమోదు

First Published 18, Nov 2017, 4:40 PM IST
nagarjuna sister naga susheela filed case against business partner
Highlights
  • పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల
  • తమకు తెలియకుండా తమ భూమిని విక్రయించాడని చింతలపూడి శ్రీనివాస్ పై కేసు
  • మోసం చేయలేదని, బెదిరించి ఆస్తులు లాక్కోవాలనుకుంటున్నారని శ్రీనివాస్ ఆరోపణలు

అక్కినేని వారింట వరుసగా జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మరో వైపు రోడ్ల వెడల్పు కార్యక్రమం అంటూ సర్కారు దాదాపు అరెకరం అన్నపూర్ణ భూములకు ఎసరు పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పుడు ఇలాంటి మరో సంఘటన అక్కినేని కుటుంబసభ్యులను కలవరపెడుతోంది. తాజాగా అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల తనకు సంబంధించిన భూమిని ఓ వ్యక్తి తన అనుమతి లేకుండా అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనను బెదిరించి ఆస్తులు రాయించుకోవాలనే కేసు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతలపూడి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా నాగార్జున సోదరి నాగ సుశీల...తన అనుమతి లేకుండా చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన భూములను విక్రయించాడని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాలను ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడ్డాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగ సుశీల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగ సుశీల ఫిర్యాదుతో శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల తనపై ఫిర్యాదు చేయడంపై శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పుడు లావాదేవీలకు పాల్పడలేదని చింతలపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బునే తీసుకున్నానని చెప్పారు.

 

తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని అన్నారు. 2005-06లోనే భూములను రిజిస్టర్ చేయించామని చెప్పారు. ఆ డబ్బులున్నీ కంపెనీనే ఖర్చు చేసిందని, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. నిధులు దుర్వినియోగం చేశాడని తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని నాగ సుశీలపై ఆయన మండిపడ్డారు.

 

కోర్టులో ఉన్న సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చేందుకే ఈ కేసు పెట్టారని అన్నారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని వివరించారు. అయినా తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.

 

తమది పెద్ద ఫ్యామిలీ అని మీ అంతుచూస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని శ్రీనివాసరావు చెప్తున్నారు. నాగ సుశీలే తనకు బాకీ ఉన్నారని ఆయన తెలిపారు. తనను ఇబ్బందుల్లోకి నెట్టి తన చేత కంపెనీ ఆస్తులను రాయించేందుకునేందుకే నాగ సుశీల ఇప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

 

ఈ వ్యవహారంలో నాగార్జున ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతోందని శ్రీనివాసరావు అన్నారు. నాగార్జున స్నేహితుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఓ నిర్మాత కలగజేసుకుని నాగ సుశీల, తన మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని చెప్పారు.

 

దివంగత మహా నటుడు నాగేశ్వరరావు తనకు స్నేహితులని శ్రీనివాసరావు చెప్పారు. అందుకే సినిమాల్లో డబ్బులు పోయినా కూడా ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన డబ్బులు పోయాయని ఎక్కడా చెప్పలేదని అన్నారు. తాను శ్రీనాగ్ ప్రొడక్షన్ కంపెనీకి మేనేజింగ్ పార్ట్నర్ అని, ఆమె కేవలం పార్ట్నర్ మాత్రమేనని చెప్పారు.

 

తనకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టేందుకు ఇలా రివర్స్ కేసు తనపై పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగ సుశీల తనకు ఇచ్చే డబ్బులు వదిలేయాలి, ఆమె చెప్పిన షరతులకు ఒప్పుకోవాలి, కంపెనీ అప్పులు కూడా ఎగ్గొట్టాలనే తనపై ఈ కేసు పెట్టారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇలా చేస్తే కంపెనీ తన పేరున నడుస్తున్నందున తనకే చెడ్డపేరు వస్తుందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ కూడా శ్రీనివాసరావుకే ఉండటం గమనార్హం.

 

‘ఆటాడుకుందాం రా' సినిమాను తాను వద్దని చెప్పినా చేశారని, ఆ సినిమా విడుదలై భారీ నష్టాలను కంపెనీకి తెచ్చిపెట్టిందని శ్రీనివాసరావు వాపోయారు. బయ్యర్లు కూడా నష్టపోయారని వివరించాడు. అంతుకుముందు శ్రీనాగ్ ప్రొడక్షన్‌లో తీసిన కాళీదాసు, అడ్డా, కరెంటు చిత్రాలు కూడా కంపెనీకి నష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

నాగ సుశీల తనను 12ఏళ్లుగా మంచోడని చెప్పి.. హఠాత్తుగా మోసం చేశారని ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. తాను మోసకారిని అయితే, 12ఏళ్లపాటు ఎందుకు కలిసి కంపెనీలో ఉన్నారని నిలదీశారు. కంపెనీకి నష్టాలు వచ్చినా తాను ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పారు. ఇది ఇలా వుంటే కోర్టులో కేసు ఉన్నందున తామేమీ మాట్లాడలేమని నాగ్ ఫ్యామిలీ చెబుతోంది.

 

నాగసుశీల, శ్రీనివాస్‌ల మధ్య ప్రాఫిట్ డిస్ప్యూట్స్ ఉన్నాయని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. శ్రీనాగ్ కార్పొరేషర్. ఎస్ఎస్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన ఆస్తుల విషయంలో వీరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఎస్ఎస్ ప్రమోటర్స్ పేరిట శ్రీనివాసరావు, అతని భార్య మరో కంపెనీని స్థాపించి దుర్వినియోగానికి పాల్పడ్డారని నాగ సుశీల ఆరోపించారని చెప్పారు. శ్రీనివాస్ భాగస్వామిగా ఉన్న తమ కంపెనీకి చెందిన 37ఎకరాల భూమికి సంబంధించి కోర్టు స్టే ఇచ్చినా శ్రీనివాస్ అమ్మేందుకు ప్రయత్నించాడని సుశీల తన ఫిర్యాదు పేర్కొందని చెప్పారు. నాగ సుశీల ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. కేసులో పూర్తి విచారణ తర్వాత మిగితా వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

 

తనతో వ్యాపార భాగస్వామిగా ఉన్న చింతలపూడి శ్రీనివాస్‌ అనే వ్యక్తి తనకు తెలియకుండా శంకర్‌పల్లిలో గల భూమిని విక్రయించాడని నాగసుశీల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమ కంపెనీ ఎస్‌ఎస్‌ ప్రాపర్టీలో డబ్బులు దుర్వినియోగం చేయడంతో పాటు ఎస్‌ఎస్‌ ప్రెమిసెస్‌ పేరిట మరో కంపెనీని ప్రారంభించి మోసం చేశాడని నాగ సుశీల ఫిర్యాదులో వివరించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

loader