మహా నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమా రిలీజైంది. ఎన్టీఆర్  తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తూ ఇందులో ప్రధాన పాత్రలో నటించటం ప్లస్ అయ్యింది. దాంతో ఇంకెవరు బయోపిక్ లు చేస్తే బాగుందనే విషయం చర్చగా మారింది. ఈ నేఫధ్యంలో ఎన్టీఆర్ సమకాలికుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

ఇప్పటికే స్క్రిప్ట్  సిద్ధం చేయిస్తున్నారని... అన్నపూర్ణ ఫిలిం స్కూల్  విద్యార్థులకు ఈ బృహత్తర కార్యాన్ని అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్క్ దాదాపు చివరి దశకు వచ్చిందని మీడియా చెప్పేస్తోంది.   ఎన్టీఆర్ సినిమా మాదిరిగా కాకుండా… ఏఎన్నార్ బయోపిక్‌లో ఆయన పూర్తి జీవితాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  ఈ మూవీలో యంగ్ ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్యను… వయసు మీద పడిన పాత్రలో సుమంత్ ను చూపించాలనే ఆలోచన చేస్తున్నారని పాత్రలు సైతం ఖరారు చేసేసి రాసేస్తున్నారు. 

రీసెంట్ గా తిరుపతిలో సైతం తన తండ్రి బయోపిక్ గురించి నాగార్జున పై అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదన్నట్లు మాట్లాడారు. గతంలోనూ అలాంటివార్తలను  తోసిపుచ్చాడు నాగార్జున‌. ఎఎన్నార్ బ‌యోపిక్ తీద్దామ‌ని గ‌తంలో ఒక‌రు సంప్ర‌దించారు. కాని నాన్న‌ది అంద‌మైన జీవితం, ఎంద‌రికో ఆద‌ర్శం. ఆనందంగా, సాదా సీదాగా ఉండే ఆయ‌న జీవిత నేప‌థ్యంలో సినిమా తీస్తే అందరికి నచ్చుతుందా.. మ‌నోళ్ళ‌కి కాస్త నెగటివిటీ ఉండాలి , అవి లేక‌పోతే సినిమాలు ఆడ‌వు కదా! కెరీర్‌లో ఒడిదుడుకులు, ఎత్తు ప‌ల్లాలు, గొడవలు ఉండాలి. అవేవీ ఆయనకు లేవు. నాన్న జీవితంపై పుస్తకం తీసుకువస్తే బావుంటుందేమో! అని త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాడు. అది నిజమే కదా.