Bigg Boss Telugu 7కి నాగార్జున తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? సినిమాల కంటే ఈ షోస్ బెటరేమో?
`బిగ్ బాస్ తెలుగు 7` షోకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ లీక్ అయ్యింది. ఈ సీజన్‌లో ఆయన గత సీజన్ కంటే ఎక్కువగానే తీసుకుంటున్నారట.

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu 7)కి గత ఐదేళ్లుగా నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా చేస్తున్నారు. ఆయన హోస్ట్ గా చేసిన ప్రారంభ సీజన్లు బాగున్నాయన్నారు. ఆ తర్వాత క్రమంగా కిక్ తగ్గుతూ వస్తుందని, గతేడాది పూర్తిగా డ్రాప్ అయ్యిందనే విమర్శలు వచ్చాయి. కంటెస్టెంట్లు డల్‌గా ఉన్నారు, షో కూడా డల్‌గానే సాగిందని, దీనికితోడు నాగార్జున కూడా హోస్ట్ గా ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడో సీజన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొత్తగా చేసే ప్రయత్నం చేశారు, చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చారు.
ఉల్టాపుల్టా అంటూ షోలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని తెలిపారు నాగ్. అదే సమయంలో హౌజ్‌లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ కన్ఫమ్ కాదు, లోపలికి వెళ్లాక తమ ఆట ఆడి పవర్ అస్త్ర దక్కించుకుని కంటెస్టెంట్ కావాలని తెలిపారు. ఆ పరంగానే ఆటని సాగిస్తున్నారు. ఒకప్పుడు కెప్టెన్సీ కోసం గేమ్స్ పెట్టేవాళ్లు, ఇప్పుడు పవర్ అస్త్ర సాధించడానికి గేమ్స్ పెడుతున్నారు. అది సాధించిన వాళ్లు.. నామినేషన్లకి అతీతంగా ఉండబోతున్నారని తెలిపారు. అది కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికితోడు కంటెస్టెంట్లు కూడా ఈ సారి మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ విషయంలో హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. అయితే ఏడో సీజన్ నుంచి నాగార్జుని తప్పిస్తున్నారని, కొత్త స్టార్‌ని తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. రానా, విజయ్ దేవరకొండ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరికి నాగార్జుననే ఫైనల్ చేశారు. అయితే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లకి పారితోషికం బాగానే అందిస్తున్నారు. రోజుకి ఇరవై వేలకు తక్కువ కాకుండా పారితోషికం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హోస్ట్ నాగార్జున పారితోషికం ఎంత అనేది హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నాగార్జున తీసుకునే రెమ్యూనరేషన్ (Nagarjuna Remuneration) లీక్ అయ్యింది. ఈ సీజన్‌లో ఆయన గత Bigg Boss సీజన్ కంటే ఎక్కువగానే తీసుకుంటున్నారట. అందులో భాగంగా రూ.20కోట్ల వరకు నాగ్‌కి పారితోషికం అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. గత సీజన్‌లో నాగ్.. రూ.16కోట్లు తీసుకున్నారని, ఐదో సీజన్‌లో 12కోట్లు, నాల్గో సీజన్‌లో 10 కోట్లు, మూడో సీజన్‌లో 8 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని టాక్.
ఇక బిగ్ బాస్ షో నాల్గో వారం చివరి దశకు చేరుకుంటుంది. గత వారం సింగర్ దామిని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు షకీలా, కిరణ్ రాథోర్ ఎలిమినేట్ అయ్యారు. 14 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పుడు 11 మంది ఉన్నారు. వారిలో శివాజీ, సందీప్, శోభా శెట్టి, శుభ శ్రీ, తేజ, గౌతమ్ కృష్ణ, యావర్, అమర్ దీప్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, రతిక ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.