బిగ్‌బాస్‌4 ఎనిమిదో వారం.. ఆదివారం రోజు ఆద్యంతం ఫన్నీగా, కామెడీగా సాగింది. అయితే ఇందులో నాగార్జున తన గతంలోకి వెళ్లడం విశేషం. ఆదివారం మొదట సాంగ్‌ల లిరిక్‌ చెప్పే టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఇందులో `ప్రియ రాగాలే.. ` అనే పాట మ్యూజిక్‌ వినిపించారు. అభిజిత్‌ అందుకు బటన్‌ నొక్కి ఆ పాట లిరిక్‌ చెప్పాడు. అంతేకాదు ఈ పాటకి డాన్స్ కూడా చేశారు. 

ఈ పాటపై హారిక, అమ్మా రాజశేఖర్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. నాగార్జున సైతం ఈ డాన్స్ కి బాగా ఇంప్రెస్ అయ్యారు. ఈ సందర్బంగా నాగార్జున గతంలోకి వెళ్లిపోయాడు. ఇది `హలోబ్రదర్‌` సినిమాలోనిదని, ఈ సినిమా షూటింగ్‌ని ఈ పాటతోనే ప్రారంభించామన్నారు. ఆ సినిమా సెట్‌లోనే సౌందర్యని కలిసినట్టు చెప్పారు. ఆమెను అలా కలవడం అదే మొదటిసారని చెప్పాడు నాగ్‌. ఈ పాట వినగానే ఒక్కసారిగా అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అంటూ రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లాడు నాగ్‌. 

నాగార్జున అలా మాట్లాడుతుండగానే అమ్మా రాజశేఖర్ కల్పించుకుని ఆ సినిమాకు నేను గ్రూప్ డ్యాన్సర్ అన్నారు. ఓహో నీవు అప్పుడు అక్కడ ఉన్నావా? అని నాగ్‌ అడగ్గా  ఆ పాట చివరి రోజున నేను గ్రూప్ డ్యాన్సర్‌గా పనిచేశాను అంటూ అమ్మా రాజశేఖర్ చెప్పి స్టెప్పులతో అలరించారు. మీకు ఆ పాట స్టెప్పులు ఇంకా గుర్తున్నాయి అంటూ నాగార్జున ప్రశంసించారు.

1994లో వచ్చిన `హలో బ్రదర్`కి ఈవీవీ సత్యానారాయణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాజ్, కోటి ద్వయం సంగీతాన్ని అందించారు. ఇందులో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.