అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి  సీక్వెల్ రెడీ అవుతోంది. ‘మన్మథుడు 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్‌లో తీసిన ఓ ఫొటోను నాగార్జున ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘నేను, నా ‘మన్మథుడు 2’ కుటుంబం.. లవింగ్‌ ఇట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో నాగ్‌ ని చూసిన వారంతా నవ మన్మధుడు అంటున్నారు. అసలు ఆయన వయస్సు కనపడటం లేదని చెప్తున్నారు.  నాగ్, రకుల్‌ జంట చక్కగా కనిపించింది.  దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తోపాటు రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఫొటోలో కనిపించారు. ఇదే సందర్భంగా తీసిన మరో ఫొటోను రాహుల్‌ పంచుకున్నారు.

మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   రకుల్‌ప్రీత్‌ సింగ్, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్స్ . ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌   ఏప్రిల్‌ 4 వరకూ సాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 12కి చిత్ర యూనిట్ పోర్చుగల్‌ ప్రయాణం కానున్నారు. 

ఇందులో నాగార్జున భార్యగా రకుల్‌ ప్రీత్‌ కనిపించనున్నారని తెలుస్తోంది. సీక్వెల్‌ కాబట్టి మొదటి పార్ట్‌ కథకు కంటిన్యూషన్ గా ఉంటుందా? లేక అందులోని క్యారక్టర్స్  మాత్రమే తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.  ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజ్‌ అయ్యే అవకాసం ఉంది.