మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లితెరపై హోస్ట్ గా నాగార్జున అందరి హృదయాలు గెలుచుకున్నారు. ఆ షో తర్వాత నాగార్జున మరోసారి బుల్లితెరపైకి వచ్చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వివాదాల నడుమ బిగ్ బాస్ సీజన్ 3 ప్రాంభమైంది. 

శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త బిగ్ బాస్ షోపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వివాదం గురించి నాగార్జున స్పందిస్తూ తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షకు గురవుతారని, తనకు తెలంగాణ పోలిసులపై నమ్మకం ఉందని అన్నారు. వివాదాలు సృష్టించాలనుకుంటే గాల్లో కూడా సృష్టించవచ్చు అని నాగ్ తెలిపాడు. 

మీలో ఎవరు కోటీశ్వరుడు షో కంటే బిగ్ బాస్ షోనే నాకు సౌకర్యంగా ఉంది. మీలో ఎవరుకోటీశ్వరుడులో బిగుసుకుపోయి కూర్చోవాలి. కానీ బిగ్ బాస్ లో హాయిగా తిరుగుతూ ఉండొచ్చు. బిగ్ బాస్ షో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అని నాగ్ అన్నారు. ఇక బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్స్ గా ఎవరు పాల్గొనబోతున్నారనే విషయం షోకు సరిగ్గా 5 నిమిషాల ముందు మాత్రమే నాకు తెలిసింది అని నాగ్ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. 

బిగ్ బాస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. షోకు ఐదు నిమిషాల ముందు మాత్రమే కంటెస్టెంట్స్ లిస్ట్ నా చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటూ నాగార్జున సరదాగా మాట్లాడారు.