నందమూరి హరికృష్ణ కారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజు నాడే హరికృష్ణ మరణించడంతో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ లో హరికృష్ణతో ఆయనకున్న బంధాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ఈవెంట్ లో పాల్గొన్న నాగార్జున మరోసారి హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. ''గత నెల కొద్దిగా బాలేదు. హరికృష్ణ అన్నయ్య, నా స్నేహితుడు రవీందర్ రెడ్డి నన్ను వదిలి వెళ్లిపోయారు. నేను ఎవరినైనా అన్నయ్య అని పిలుస్తానంటే అది హరిని మాత్రమే.. అయన చనిపోయిన రోజు నా పుట్టినరోజు. ఆ రోజు పొద్దున్నే హరి అన్నయ్య మరణ వార్త విన్నాను.

అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా అర్ధం కాలేదు. మా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి నాన్న దగ్గర నుండి ఉన్నారు. నేను సినిమాలోకి వస్తున్నానని తెలియగానే మొదట నాకు కంగ్రాట్స్ చెప్పింది ఆయనే. నా దగ్గరకి వచ్చి తొలిసారి ఫోటో దిగింది కూడా తనే. ఏ ఫంక్షన్ జరిగిన పనులన్నీ ఆయన భుజానే వేసుకునేవారు. మొన్నే వాళ్ల కుటుంబాన్ని కలిసొచ్చా.. ఆయన ఏ లోకంలో ఉన్నా.. తన ఆత్మకు శాంతి కలగాలి'' అంటూ వెల్లడించారు.