Asianet News TeluguAsianet News Telugu

ప్రాజెక్టు కన్ఫర్మ్: తాతగా నాగ్, మనవడుగా చైతు

ఎఫ్ 2 హిట్ అవటం సీనియర్ హీరోలకు కాస్తంత ఉషారుని తెచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున పెండింగ్ లో ఉన్న  తన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 

Nagarjuna and Naga Chaitanya are expected to play the lead roles in Bangarraju
Author
Hyderabad, First Published Jan 18, 2019, 10:07 AM IST

ఎఫ్ 2 హిట్ అవటం సీనియర్ హీరోలకు కాస్తంత ఉషారుని తెచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున పెండింగ్ లో ఉన్న  తన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఫన్ ఉంటే సీనియర్ హీరోలను సరదాగా మోసేస్తాం అని జనం ఫిక్స్ అయ్యారని  అర్దమవటంతో నాగ్ తన బంగార్రాజు ప్రాజెక్టుని కదిలించారు. 

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం వచ్చింది. నాగార్జున ద్వి పాత్రాభినయం చేసిన ఆ సినిమా ఘన విజయం సాధించింది.  ముఖ్యంగా ఈ సినిమాలో  బంగార్రాజు క్యారక్టర్ కు మంచి రెస్పాన్స్  వచ్చింది. దాంతో ఆ పాత్రను బేస్‌ చేసుకుని కథను సిద్దం చేయాల్సిందిగా మూడు సంవత్సరాల క్రితమే కళ్యాణ్‌ కృష్ణకు నాగార్జున చెప్పాడు. అప్పటి నుండి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఎన్నో వెర్షన్స్ ను తీసుకు వచ్చాడు. కాని నాగ్‌ కు మాత్రం ఏది నచ్చలేదు. చివరకు నాగార్జునను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మెప్పించాడు.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. అయితే నాగార్జున ఈ సారి తనొక్కడే బరువు మొయ్య దలుచుకోలేదు. తన కొడుకు నాగచైతన్య ని కూడా తోడు తెచ్చుకుంటున్నాడు. ఇద్దరూ కలిసి ఈ సినిమాతో నవ్వించే భాక్సాఫీస్ కు పండగ చేద్దాం అనుకుంటన్నారు.

ఇక నాగార్జున, నాగచైతన్య సినిమాలో తండ్రి కొడుకులాగానే కనిపిస్తారా అంటే అదేమీ లేదు. తాత-మనవడుగా కనిపించబోతున్నట్లు సమాచారం. బాబి దర్శకత్వంలో  నాగచైతన్య  చేయబోతున్న వెంకీ మామ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే సంక్రాంతికి కూడా ఓ కామెడీ సినిమా రెడీ అవుతోందన్నమాట. ఈ సినిమా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా రాబోతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios