యాపిల్ ప్రొడక్ట్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఒకప్పుడు డబ్బున్న వారు ఎక్కువగా తమ స్టేటస్ చూపించుకోవడానికి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూడేవారు. అయితే ఇప్పుడు మారిన కాలంలో అందరూ కొంటున్నారు. ముఖ్యంగా  ఈ ప్రొడక్ట్స్ కి పెద్దగా సమస్యలు రాకపోవటం,డేటా సెక్యూరిటీ కోసం ఈ ఫోన్స్ ని ఆశ్రయిస్తారు. హ్యాక్ చేయటం కష్టమనే ఉద్దేశ్యంతో సెలబ్రెటీలు ఈ ఫోన్ కే ప్రయారిటీ ఇస్తూంటారు. అదే పద్దతిలో నాగార్జున సైతం ఈ ఫోన్ ని వాడుతున్నారు. మరి ఫోన్ కు ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ ఆయన  ఈ సంస్థ పాలసీలను, సర్వీస్ లను తూర్పారబడుతూ ట్వీట్ చేశారు.

యాపిల్‌ సేవలపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. యాపిల్‌ సేవలు.. ఏక పక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా నాగ్‌.. తన కోపాన్ని బయటపెట్టారు. అంతేకాకుండా యాపిల్‌ సేవల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘భారత్‌లోని యాపిల్‌ స్టోర్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ల సేవలు, పాలసీలు ఏక పక్షంగా ఉన్నాయి. ఇది మరీ ఘోరమైన చర్య.’ అని నాగ్‌ పేర్కొన్నారు. అయితే, తన కోపానికి గల కారణాన్ని మాత్రం నాగ్‌ బయటపెట్టలేదు.

ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పక్కన కొంతమంది ఆయన సమర్థిస్తూ ఉంటే మరికొందరు మాత్రం మేడిన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడకుండా ఇలాంటివి వాడితే ఇలాగే ఉంటుంది అన్నట్టు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో మీరు ట్వీట్ చేసింది కూడా ఐ ఫోన్ నుంచే కదా అన్నట్లు కామెడీగా నాగ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఐ ఫోన్ సెక్యూరిటీ పర్పస్ కోసం వాడతారు అని సుద్దులు చెప్తున్నారు. 

కెరీర్ విషయానికి వస్తే.. అహిసోర్‌ సోల్మన్‌ దర్మకత్వంలో తెరకెక్కుతున్న ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రంలో ప్రస్తుతం నాగ్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన విజయ్‌వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దీనితోపాటు బాలీవుడ్‌లో రానున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఆయన నటించనున్నారు.