నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమా  సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఎన్టీఆర్  తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తూ ఇందులో ప్రధాన పాత్రలో నటించటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఊహించిన విధంగా సినిమా ఆడలేదు. కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది.  ఈ నేఫధ్యంలో ఎన్టీఆర్ సమకాలికుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుందని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అదే ప్రశ్నను నాగ్ ముందు ఉంచుతున్నారు మీడియావారు. 

తాజాగా నాగ్ రెండవ కుమారుడు అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వ‌ర‌లో `మిస్ట‌ర్ మ‌జ్ను` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరో అఖిల్‌తోపాటు నాగార్జున కూడా సినిమా ప్ర‌మోష‌న్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఏఎన్నార్ బ‌యోపిక్ గురించి నాగార్జునని మీడియావారు ప్రశ్నిస్తే ఆయన స్పందించారు.

నాగార్జున మాట్లాడుతూ... ''నాన్న‌గారు న‌టించిన సినిమాల‌ను రీమేక్  చేయ‌డానికే మేం చాలా భ‌య‌ప‌డుతుంటాం. అలాంటిది ఆయ‌న బ‌యోపిక్ తీయ‌డం మాట‌లు కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారికి ఘ‌న నివాళిగా ఉండాల్సిన బ‌యోపిక్ గ‌న‌క ఫ్లాప్ అయితే మేం త‌ట్టుకోలేం. నాన్నగారి బ‌యోపిక్ తీసే ఉద్దేశం మాకు లేదు'' అని నాగార్జున చెప్పారు. ఇది విన్న వారు ఎన్టీఆర్ బయోపిక్ కు వచ్చిన రిజల్ట్ చూసి నాగార్జున ఈ మాటలు అన్నారని అంటున్నారు. 

అలాగే రీసెంట్ గా తిరుపతిలో సైతం తన తండ్రి బయోపిక్ గురించి నాగార్జున పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎఎన్నార్ బ‌యోపిక్ తీద్దామ‌ని గ‌తంలో ఒక‌రు సంప్ర‌దించారు. కాని నాన్న‌ది అంద‌మైన జీవితం, ఎంద‌రికో ఆద‌ర్శం. ఆనందంగా, సాదా సీదాగా ఉండే ఆయ‌న జీవిత నేప‌థ్యంలో సినిమా తీస్తే అందరికి నచ్చుతుందా.. మ‌నోళ్ళ‌కి కాస్త నెగటివిటీ ఉండాలి , అవి లేక‌పోతే సినిమాలు ఆడ‌వు కదా! కెరీర్‌లో ఒడిదుడుకులు, ఎత్తు ప‌ల్లాలు, గొడవలు ఉండాలి. అవేవీ ఆయనకు లేవు. నాన్న జీవితంపై పుస్తకం తీసుకువస్తే బావుంటుందేమో! అని త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాడు. ఏదైమైనా ఏ ఎన్నార్ బయోపిక్ వచ్చే అవకాసం లేదని నాగ్ క్లారిటీ ఇవ్వటం గొప్ప విషయం.