Asianet News TeluguAsianet News Telugu

‘స‌వ్య‌సాచి’మూవీ రివ్యూ

మాస్ హీరో కావాలనే కల నెరవేరటం కోసం నాగ చైతన్య కంటిన్యూగా ప్రయత్నాలు చేయటం మానటం లేదు. అప్పట్లో వచ్చిన దడ, బెజవాడ, ఆటో నగర్ సూర్య ల రిజల్ట్ లతో కాస్త వెనక్కి తగ్గాడు. కానీ మళ్లీ   దోచేయ్, సాహసం శ్వాసగా సాగిపో, శైలజా రెడ్డి ..అంటూ వరస పెట్టాడు. కానీ ఏదీ కలిసి రాలేదు. అయితే ఈ సారి రొటీన్ మాస్ సినిమా కాకుండా కాస్తంత విభిన్నమైన పాయింట్ ఉండాలని లెప్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే మెడికల్ ఎలిమెంట్ ని కలుపుతూ తయారు చేసిన కథ ఓకే చేసాడు. 

Nagachaithanya Savyasachi movie review
Author
Hyderabad, First Published Nov 2, 2018, 1:30 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

మాస్ హీరో కావాలనే కల నెరవేరటం కోసం నాగ చైతన్య కంటిన్యూగా ప్రయత్నాలు చేయటం మానటం లేదు. అప్పట్లో వచ్చిన దడ, బెజవాడ, ఆటో నగర్ సూర్య ల రిజల్ట్ లతో కాస్త వెనక్కి తగ్గాడు. కానీ మళ్లీ   దోచేయ్, సాహసం శ్వాసగా సాగిపో, శైలజా రెడ్డి ..అంటూ వరస పెట్టాడు. కానీ ఏదీ కలిసి రాలేదు. అయితే ఈ సారి రొటీన్ మాస్ సినిమా కాకుండా కాస్తంత విభిన్నమైన పాయింట్ ఉండాలని లెప్ట్ హ్యాండ్ సిండ్రోమ్ అనే మెడికల్ ఎలిమెంట్ ని కలుపుతూ తయారు చేసిన కథ ఓకే చేసాడు.  ట్రైలర్స్, టీజర్స్ ,పోస్టర్స్ అన్నీ మాస్ ... సినిమా అని, లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ కథ అని ఎస్టాబ్లిష్ చేసాయి. ఈ సారి అయినా చైతన్య గెలుస్తాడా. టైటిల్ కి తగ్గట్లే తెరపై విజృంభించాడా.. లేక మరో సారి దడ..బెజవాడ దారిలోకే ప్రయాణం పెట్టుకున్నాడా రివ్యూలో చూద్దాం. Nagachaithanya Savyasachi movie review

 

స్టోరీ లైన్  

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్తున్న టూరిస్ట్ బస్ లో ఒకరికొకరు పరిచయం లేని  21 మంది ప్రయాణికులు ఉంటారు. అయితే కాస్సేపటికి వారి మాటల్లో వారందరికీ అరుణ్ అనే వ్యక్తి లింక్ ఉందని అర్థమవుతుంది. పరిచయం లేని తమకు ఓకే వ్యక్తి పరిచయం ఉండటం ఏమిటని షాక్ అవుతారు. ఈ లోగా ... బ‌స్సు లోయలో పడి  ప్ర‌మాదానికి గుర‌వుతుంది. ఆ బస్ లో ఉన్న విక్ర‌మ్ ఆదిత్య ‌(నాగ‌చైత‌న్య‌) మిన‌హా అందరూ చ‌చ్చిపోతారు. విక్రమ్ ఒక్కడే ఎలా బ్రతికి బయిటపడ్డాడు అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంతకీ విక్రమ్ ఎవరు... అతనో యాడ్ ఫిలిం మేకర్. 

ఆ తర్వాత విక్రమ్ తన అక్క, బావ‌(భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి)ని కలుస్తాడు. అక్కడ అక్క కూతురుతో విక్రమ్ కు ఉన్న ఎమోషన్ బాండింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతేకాకుండా విక్రమ్ కు .. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చిన సమస్య ఉంటుంది. దాని  కార‌ణంగా విక్ర‌మ్ ఎడ‌మ చేయి అత‌ని మాట వినదు.   కోపం వ‌చ్చినా, ఆనందం వ‌చ్చినా ఎడ‌మ చేయి ఓ రేంజిలో  రియాక్ట్ అవుతుంటుంది.  తన జీవితంలో అదో  పెద్ద స‌మ‌స్య‌గా విక్ర‌మ్ భావిస్తాడు. ఈలోగా  ఓ రోజు  ఓ యాడ్‌ ఫిలిం పని మీద విక్రమ్‌ న్యూయార్క్‌ వెళ్తాడు.  వచ్చే సరికి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుతుంది. బావ చనిపోతాడు. అక్క హాస్పిటల్‌ లో ఉంటుంది. 

Nagachaithanya Savyasachi movie review

మేనకోడలు మహాలక్ష్మి కూడా చనిపోయిందని రిపోర్ట్ వస్తుంది. కానీ ఓ చిన్న లాజిక్ తో ఆ పిల్ల బ్రతికే ఉందని, ఓ అజ్ఞాత వ్యక్తి (మాధవన్) కిడ్నాప్ చేసారని తెలుసుకుంటాడు. ఇంతకీ మహాలక్ష్మిని ఎందుకు  కిడ్నాప్ చేసారు.  వారి ఉద్దేశ్యమేమిటి..  విక్రమ్‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయా..? మొదటి చెప్పుకున్న బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? ఈ చిత్రమైన సమస్యల  నుంచి విక్రమ్ ఆదిత్య ఎలా బయటపడ్డాడు..? ఎడమ చేతి కథేంటి.. సినిమాలో హీరోయిన్  చిత్ర‌(నిధి అగ‌ర్వాల్‌) క్యారెక్టర్ ఏమిటి అన్నదే మిగతా కథ.

ఫస్ట్ సీన్ నుంచే..అపసవ్యం

 ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ సీన్ ...నుంచే హాలీవుడ్ ఎత్తిపోతల పథకం ప్రారంభం అయ్యి గౌరవం పోతుంది. ప్రారంభంలో వచ్చే బస్ ఎపిసోడ్..యాజటీజ్..  Wild Tales (2014) చిత్రం నుంచి లేపారు. అందులో ఫ్లైట్ లో జరిగే కథని ఇక్కడ బస్ కు మార్చారు. అదే కథలో కీలక పాయింట్ గా ఉంటుంది. ఎత్తటం వేరు ..ప్రేరణ పొందటం వేరు కదా. ఎత్తటమే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు హైలెట్ గా చెప్పబడుతున్న వానిషింగ్ ట్విన్ సిండ్రోం ..తెలుగు తప్ప ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు వచ్చాయి.  కన్నడలో వచ్చిన‘సంకష్ట కర గణపతి’కూడా ఇదే కాన్సెప్టు. తమిళంలో వచ్చిన ‘పీచన్కాయ్’ఇదే కాన్సెప్టు.

రొటీన్ రివేంజ్ స్టోరీనే కాకపోతే

 అయితే ఆ కథలు ఇంత నాసిరకంగా లేవు. ఎడమ చేతి సమస్య అనే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. తెలుగులో అదే జరగలేదు. తెలుగులో దాన్ని  కేవలం ఓ ఎలిమెంట్ గా వాడారంతే. ఆ విషయం ప్రక్కన పెడితే సినిమా ఫక్తు రివేంజ్ స్టోరీ. అందులో ఎడమ చేయి ఇబ్బంది అనేది ఉన్నా లేకపోయినా కథలో ఒక్క సీన్ లో కూడా మార్పు రాదు. 

మాధవన్ పాత్ర 

ఈ సినిమాలో విలన్ గా చేసిన మాధవన్ పాత్ర విషయానికి వస్తే.. అతను పాపను కిడ్నాప్ చేసిన కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అలాంటి సంఘటనలు బయిట జరగొచ్చేమో కానీ ఈ సినిమా కు ఉన్న బిల్డప్ కు తేలిపోయింది. 

ప్యాసివ్ పాత్ర

విలన్ పాత్ర ఇంటర్వెల్ దాకా రాదు.  హీరోకు ఫలానా వ్యక్తి విలన్ ..అని తెలుసుకునే సరికే దాదాపు ప్రీ క్లైమాక్స్ వచ్చేస్తుంది . దాంతో ఎంతసేపూ విలన్ ..హీరోని ఆడుకోవటమే కానీ..హీరో తిరగబడి విలన్ ని ఎదుర్కోవటమనేది  ఉండదు. చివర్లో తప్పదు అన్నట్లు విలన్, హీరోల మధ్య ఓ ఫైట్ పెట్టి క్లోజ్ చేసేసారు. విలన్ , హీరోకు సరిగ్గా కాన్ఫ్లిక్ట్ లేకపోవటంతో సినిమా తేలిపోయింది. 

చైతూ ఎలా చేసాడు

ఈ సినిమాలో నాగచైతన్య గొప్పగా చేసాడు అనలేం కానీ ..అలా చేసుకుంటూ పోయాడు ఎప్పటిలాగే. అయితే రొటీన్ గా లేకుండా కొంచెం కొత్తగా అనిపించాడు. నిధి అగర్వాల్   స్క్రీన్ ప్రెజెన్స్  జస్ట్ ఓకే. నటన గురించి మాట్లాడటానికి ఆమెకు అసలు సీన్స్ ఉంటే కదా. సెకండాఫ్ లో అయితే గెస్ట్ రోల్ అనుకుంటాం. వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్ తమ కామెడీ టైమింగ్  తో కాస్త రిలీఫ్ ఇచ్చారు. 
 
టెక్నికల్ గా..

డైరక్ట్రర్ చందు మొండేటి మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ  ఈ సినిమా కథనే చాలా లేజీగా అల్లుకున్నాడనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కాలేజీ సీన్స్ సహనానికి పరీక్షగా మారాయి. ఇంటర్వెల్ దగ్గర మాధవన్ ఎంట్రీ దాకా అసలు కథపై ఇంట్రస్టే ఉండదు. అదేదో కాస్త ముందర మాధవన్ ని తీసుకొస్తే ఫస్టాప్ లో బోర్ కొట్టే సీన్స్ తగ్గిపోయేవి. 

సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అని టైటిల్స్ చూడకపోతే గుర్తించలేం. అంత నాశిరకంగా ఉన్నాయి. రీమిక్స్ సాంగ్ కూడా తేలిపోయింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలెట్ గా ఉంది.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. 

చూడచ్చా..

నాగచైతన్య అభిమానులై..ప్రతీ సినిమా ఖచ్చితంగా చూడాలి అనే నియమం ఉన్నవాళ్లు చూడచ్చు. మిగిలిన వాళ్లకు ఇదో అపసవ్య వ్యవహారంగా..చాచి పెట్టిన కొట్టిన ఫీలింగ్ గా అనిపిస్తుంది. 

ఫైనల్ ధాట్..

మాస్ కథ అని చెప్పి చైతూ ని మాయచేసి సినిమా ఓకే చేయించుకుంటున్న డైరక్టర్స్..అదే కథతో ప్రేక్షకులను మాత్రం మాయ చేయలేకపోతున్నారు. 

రేటింగ్: 2/5

 

ఎవరెవరు...

నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి, బ్ర‌హ్మాజీ, స‌త్య‌, వెన్నెల‌కిశోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌
క‌ళ: రామ‌కృష్ణ‌
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం)
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందు మొండేటి

 

Follow Us:
Download App:
  • android
  • ios