పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని, కాస్త రఫ్‌గా పెంచాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని  దైర్యంగా ఎదుర్కొనేలా తయారు చేయాలని అంటున్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఆయన యూట్యూబ్‌లో మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తాము పెరిగిన విధానం, పిల్లల్ని పెంచాల్సిన విధానంపై అనేక విషయాలను పంచుకున్నారు. 

నాగబాబు చెబుతూ, తమ కాలంలో పిల్లల్ని పెంచే విధానం ఇప్పటితో పోల్చితే వేరేలా ఉండేదన్నారు. తాము పరీక్షల్లో ఫెయిల్‌ అయినా, పాస్ అయినా మా ఇంట్లో ఏం అనేవాళ్ళు కాదు. కాకపోతే పాస్‌ కావాలని చెప్పేవారని, పాస్‌, ఫెయిల్‌ ముఖ్యం కాదు, సబ్జెక్ట్, సామాజిక పరిణతికి ప్రాధాన్యతనిచ్చేవారని చెప్పారు. ఈ విషయాల్లో తమ తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉందని, ఏ విషయంలోనూ తమపై ఒత్తిడి పెంచాలేదని నాగబాబు చెప్పారు. 

ఇంకా చెబుతూ, ఎక్సైజ్‌ డిపార్ట్ మెంట్‌లో పనిచేసే మా నాన్నకు చాలా లోకజ్ఞానం ఉండేదని, మా కోరికలను, ఆలోచలను గౌరవిస్తూనే, మాకు మార్గనిర్ధేశం చేసేవారని తెలిపారు. చిరంజీవి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారట. తాను లైఫ్‌లో సెటిల్‌ కావడానికి, నిర్మాతగా మారడానికి అన్నయ్య చిరంజీవినే కారణమని, తనని స్వతంత్రంగా ఎదగాలని చెప్పేవారని పేర్కొన్నాడు నాగబాబు. మేం ఏం పనిచేసినా ఆ విషయంలో మాకు అంతిమ నిర్ణయాన్ని ఇచ్చేవారని, కాకపోతే, ప్లాన్‌ బీతో కూడా ఉండేవారని తెలిపారు. 

ఇక పిల్లల గురించి నాగబాబు చెబుతూ, పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలని, తమ కాలంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదని, మాకు, మా పిల్లలకు దొరికినంత స్వేచ్ఛ, వాళ్ల పిల్లలకు, నెక్ట్స్ జనరేషన్‌ పిల్లలకు దొరకడం లేదని, మన భయాలు, ఆలోచనలు వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం కాకూడదని చెప్పారు. 

పిల్లలను రఫ్‌గా పెంచాలన్నారు. ఎండలో ఆడిపించాలని, వర్షంలో తడవనివ్వాలని, అలా చేయకూడదనేది పిచ్చి మాటలని చెప్పారు. వాళ్లని ప్రకృతిని ఆస్వాధించేలా చేయాలన్నారు. మరీ సున్నితంగా పెంచకూడదని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలన్నారు. తండ్రి రోజుకి కనీసం గంటైనా వారితో ఆడుకోవాలని, అప్పుడే వాళ్ళ ఆలోచనలు, సామర్థ్యాలు తెలుస్తాయ`ని చెప్పారు. నిర్మాతగా ఫెయిల్‌ అయిన నాగబాబు నటుడిగా, హోస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా రాణిస్తుండగా, తనయు నిహారిక మెప్పించలేకపోయింది. త్వరలో ఆమె పెళ్ళి చేసుకోబోతుంది.